ఆగస్ట్‌ 26 వరకూ సీబీఐ కస్టడీకి చిదంబరం

Chidambaram Presents At Cbi Court Over Inx Media Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంను ఆగస్ట్‌ 26 వరకూ ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. రోజుకు అరగం‍ట పాటు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆయనను కలిసేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. సీబీఐ అధికారులు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరాన్ని హాజరు పరిచారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు చిదంబరం లాభం చేకూర్చారని న్యాయస్ధానం ఎదుట సీబీఐ వాదించింది. మనీల్యాండరింగ్‌కు ఈ కేసు ఉదాహరణని పేర్కొంది. చిదంబరాన్ని కనీసం ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. కాగా, బోన్లో కూర్చునేందుకు నిరాకరించిన చిదంబరం వాదనలు జరిగిన ఆసాంతం నిలబడే ఉన్నారు.

వాడివేడి వాదనలు

కేసు డైరీలో చిదంబరం పాత్ర ఉందని, మరింత లోతైన విచారణ అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఉన్నందున చిదంబరాన్ని అరెస్ట్‌ చేశామని చెప్పారు. ఐఎన్‌ఎక్స్‌ కేసులో ఆధారాలతో చిదంబరాన్ని కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాము అడిగిన ఏ ప్రశ్నకూ చిదంబరం సమాధానం ఇవ్వలేదని, విచారణకు ఆయన సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చిదంబరం అన్నీ తెలిసే అధికార దుర్వినియోగం చేశారని, ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు అనుకూలంగా వ్యవహరించారని కోర్టు ఎదుట సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు.

అరెస్ట్‌పై విస్మయం

ఐఎన్‌ఎక్స్‌  కేసులో చిదంబరంను ఎందుకు అరెస్ట్‌ చేశారో అర్ధం కావడం లేదని ఆయన తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో కార్తీకి ఇప్పటికే బెయిల్‌ వచ్చిందని రాజకీయ దురుద్దేశంతోనే చిదంబరాన్ని అరెస్ట్‌ చేశారని సిబల్‌ వాదించారు. సీబీఐ విచారణకు చిదంబరం ఎప్పుడూ గైర్హాజరు కాలేదని అన్నారు. సీబీఐ వద్ద ప్రశ్నలు సిద్ధంగా లేవని, కేవలం 12 ప్రశ్నలే అడిగారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పదేళ్ల తర్వాత ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని అన్నారు. ఎఫ్‌ఐపీబీలో ఆరుగురు కార్యదర్శులు ఉంటారని, వారే ఐఎన్‌ఎక్స్‌లో విదేశీ నిధులకు ఆమోదం తెలిపినా వారిలో ఏ ఒక్కరినీ అరెస్ట్‌ చేయలేదని అన్నారు. సీబీఐ ఏదో జరిగిందన్న మాత్రాన అది నిజం కాదని పేర్కొన్నారు.నేరాన్ని అంగీకరించకపోతే సహకరించలేదనడం సరైంది కాదని వాదించారు. సీబీఐ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఆయన సమాధానం ఇచ్చారని చెప్పారు.

విదేశాల్లో బ్యాంకు ఖాతాల్లేవు : చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ కేసులో తాను సీబీఐ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చానని, ఈ వ్యవహారంలో తాను ఎవరినీ లంచం అడగలేదని చిదంబరం కోర్టుకు తెలిపారు. తనతో పాటు తన తనయుడి ఖాతాల వివరాలను సీబీఐకి అందచేశానని కోర్టుకు నివేదించారు. తనకు విదేశాల్లో బ్యాంకు ఖాతాలు లేవని స్పష్టం చేశారు. ఇక అంతకుముందు సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించి చిదంబరంను అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం చిదంబరంను భారీ భద్రత నడుమ కోర్టుకు తరలించారు. మరోవైపు చిదంబరానికి బెయిల్‌ కోసం కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. పార్టీ సీనియర్‌ నేతలు, న్యాయవాదులైన కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వి, సల్మాన్‌ ఖర్షీద్‌లు ఆయనకు బెయిల్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిదంబరం భార్య నళిని, కుటుంబ సభ్యులు కోర్టుకు తరలివచ్చారు. కాగా చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారం న్యాయస్ధానం ఎదుట విచారణకు రానుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top