ఛత్తీస్‌గఢ్‌ ఏదీ సందడి | Chhattisgarh is the second phase of polling in the second phase of Ls Polls | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌ ఏదీ సందడి

Apr 17 2019 6:02 AM | Updated on Apr 17 2019 6:24 AM

Chhattisgarh is the second phase of polling in the second phase of Ls Polls - Sakshi

లోక్‌సభ ఎన్నికల రెండో దశలో గురువారం పోలింగ్‌ జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లోని మూడు సీట్లలో ఎలాంటి ఆర్భాటం, సందడి లేకుండా ప్రచారం సాగుతోంది. కిందటి డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు బీజేపీ మాజీ సీఎం రమణ్‌సింగ్‌ అల్లుడు డా.పునీత్‌ గుప్తా ఆరోగ్యసేవల కుంభకోణంలో చిక్కుకోవడం కాషాయపక్షాన్ని కుంగదీస్తోంది. మరోవైపు బీజేపీ సిటింగ్‌ సభ్యులందరికీ టికెట్లు నిరాకరించారు. అయినా వారంతా ‘విధేయులైన సైనికుల్లా’ కొత్త అభ్యర్థుల తరఫున ప్రచారంచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి తమను ఇలా శిక్షించడం న్యాయం కాదని తమఆక్రోశం ప్రకటించి మరీ ప్రచార పర్వంలో మునిగిపోయారు.

కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే కావడంతో సాధించిన విజయాలేవీ చెప్పుకోవడానికి లేవు. నిరుపేదలకు ఏడాదికి రూ.72 వేల సాయం చేస్తామన్న వాగ్దానంపైనే కాంగ్రెస్‌ ఆధారపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో చేతులు కలిపిన తొలి సీఎం అజిత్‌ జోగీ నేతృత్వంలోని జనతా కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బీఎస్పీకి మద్దతు ఇస్తోంది. మొదటి దశలో బస్తర్‌ సీటుకు పోలింగ్‌ జరిగింది. మిగిలిన ఏడు స్థానాలకు ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 11 సీట్లలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ.

మహాసముంద్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దివంగత విద్యాచరణ్‌ శుక్లా 1957 నుంచి 1989 వరకూ ఆరుసార్లు గెలిచిన స్థానం మహాసముంద్‌. ఆయన అన్న మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శ్యామా చరణ్‌ శుక్లా ఒకసారి గెలిచారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ తొలిసారి ఓడిపోయింది. అజిత్‌ జోగీ కాంగ్రెస్‌ టికెట్‌పై 2004లో ఇక్కడ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత 2009, 2014లో బీజేపీ అభ్యర్థి చందూలాల్‌ సాహూ విజయం సాధించారు. కిందటి ఎన్నికల్లో ఆయన అజిత్‌ జోగీని ఓడించారు. ఈసారి కొత్త అభ్యర్థులు చున్నీలాల్‌ సాహూ(బీజేపీ), ధనేంద్ర సాహూ(కాంగ్రెస్‌) పోటీపడుతుండగా, బీఎస్పీ తరఫున ధన్‌సింగ్‌ కోసరాయా రంగంలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులిద్దరూ సాహూ (తేలీ) వర్గానికి చెందిన బీసీలు. ఈ స్థానంలో సాహూలదే ఆధిపత్యం. ఇద్దరు çసాహూలూ తేలీ వర్గం ఓట్లు చీల్చుకుంటారు.

తేలీ వర్గం ఓట్లు సమానంగా చీలిపోతే మరో బీసీ వర్గమైన కుర్మీలే విజేతను నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌ కుర్మీ కావడంతో మహాసముంద్‌లో వారి ఓట్లు అత్యధికంగా కాంగ్రెస్‌ అభ్యర్థి ధనేంద్రకే పడతాయని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. కాని, ధనేంద్ర స్థానికుడు కాదనే విషయాన్ని బీజేపీ బాగా ప్రచారం చేస్తోంది. మహాసముంద్‌ పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించగా, మిగిలిన మూడింటిని బీజేపీ గెలుచుకుంది. ఈ మూడు సీట్లలోనూ బీజేపీ కుర్మీ నేత అజయ్‌ చంద్రాకర్‌ పలుకుబడి ఎక్కువ. రెండు వరుస పరాజయాల తర్వాత ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్‌ సీఎం బాఘేల్‌ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. తన వర్గం ఓట్లను అత్యధికంగా కాంగ్రెస్‌ అభ్యర్థికి పడేలా చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ సీటును బీజేపీ నిలబెట్టుకోవడానికి రమణ్‌సింగ్, ఆయన పూర్వ మంత్రివర్గ సహచరులు గట్టి ప్రచారం చేస్తున్నారు.

రమణ్‌ కుమారుడి స్థానంలో కొత్త అభ్యర్థి
రమణ్‌సింగ్‌ సొంత స్థానం రాజ్‌నంద్‌గావ్‌లో సిట్టింగ్‌ సభ్యుడు అభిషేక్‌సింగ్‌కు బదులు సంతోష్‌ పాండేకు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. రాజపుత్రుడైన రమణ్‌ కొడుకు అభిషేక్‌ 2014లో బీజేపీ టికెట్‌పై గెలిచారు. సీఎం కొడుకును కాదని బ్రాహ్మణ వర్గానికి చెందిన పాండేకు టికెట్‌ ఇచ్చిన బీజేపీ నాయకత్వం ప్రయోగం చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున భోలారామ్‌ సాహూ ఎన్నికల బరిలోకి దిగారు. ఈయన స్థానికంగా బలమైన తేలీ వర్గానికి చెందిన నేత. బీఎస్పీ టికెట్‌పై ఆదివాసీ అయిన రవితా లకఢా ధ్రువ్‌ పోటీచేస్తున్నారు. 

కాంకేర్‌ (ఎస్టీ)లో పోటాపోటీ
ఆదివాసీలకు రిజర్వ్‌ చేసిన కాంకేర్‌ స్థానంలో బీజేపీ నేత విక్రమ్‌దేవ్‌ ఉసేండీ 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి ఫూలో దేవి నేతమ్‌ను ఓడించారు. ఇక్కడ కూడా బీజేపీ కొత్త అభ్యర్థిని రంగంలో నిలిపింది. బీజేపీ టికెట్‌పై మోహన్‌ మండావీ, కాంగ్రెస్‌ తరఫున బీరేష్‌ ఠాకూర్‌ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ తరఫున సుబే సింగ్‌ ధ్రువా రంగంలో ఉన్నారు. దళితులు, ఆదివాసీల కలయిక కోసం అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి, అజిత్‌ జోగీ చేతులు కలిపినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అయితే, ఈసారి బీఎస్పీకి గణనీయ సంఖ్యలో ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో బీఎస్పీ నెమ్మదిగా బలం పుంజుకుంటోంది. 1998 నుంచి వరుసగా ఐదు సార్లు బీజేపీ కాంకేర్‌లో విజయం సాధించింది.
డేట్‌లైన్‌: రాయ్‌పూర్‌
ఎన్‌.వి.రమణమూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement