చంద్రయాన్‌ టెన్షన్‌.. అందినట్టే అంది..

Chandrayaan 2 Communication Lost With Vikram Lander Says Sivan - Sakshi

చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు  సజావుగా సాగిన ప్రయాణం

ఇక కొన్ని క్షణాల్లో చంద్రుడిని తాకుతుందనగా సిగ్నల్స్‌ కోల్పోయిన వైనం

సాక్షి, న్యూఢిల్లీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్‌–2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్‌ ల్యాండర్‌ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్‌ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్‌ నుంచి ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక కొద్దిసేపు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అనంతరం ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ఈ అంశంపై ఓ ప్రకటన చేశారు. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్‌ నుంచి గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయాయని తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను ఆసాంతం వీక్షించిన ప్రధాని మోదీకి శివన్‌ ఈ విషయం తెలియజేయగా.. ఆయన ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు మీరు సాధించింది తక్కువ ఏమీ కాదని శివన్‌ భుజం తట్టారు. మీరు ధైర్యంగా ముందుకెళ్లండి.. నేను మీకు అండగా ఉంటాను అని ప్రధాని వారిలో భరోసా కల్పించారు.
 

పసిబిడ్డను పొత్తిళ్లలో వేసినట్లే... 
చంద్రయాన్‌ –2 ప్రయోగానికి సంబంధించి అన్నీ ముందుగా అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని  అంతకుముందు ఇస్రో డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శివన్‌ పేర్కొన్నారు. ‘‘చంద్రయాన్‌ –2 ప్రాజెక్టులో పనిచేసిన శాస్త్రవేత్తలందరిలోనూ ఎంతో ఉత్కంఠత ఉంది. ఎందుకంటే ఈ ప్రయోగం చాలా సంక్లిష్టమైనది. పైగా ఇస్రో ఇలాంటి ప్రాజెక్టు చేపట్టడం ఇదే తొలిసారి కదా!!’’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఇస్రో సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘సెన్సర్లు, కంప్యూటర్లు, కమాండ్‌ వ్యవస్థ అన్నీ పక్కాగా పనిచేశాయి. చేస్తాయి కూడా. భూమ్మీద చాలుసార్లు వీటిని విజయవంతంగా పరీక్షించిన ధైర్యంతో ఈ మాట చెబుతున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. విక్రమ్‌ సాఫ్ట్‌ల్యాండింగ్‌ చాలా సున్నితమైన ప్రక్రియ అని.. అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఉయ్యాలలో ఎంత జాగ్రత్తగా వేస్తామో ఇది కూడా అంతేనని ఆ అధికారి అన్నారు.  

భారతీయ ప్రతిభకు తార్కాణం: మోదీ 
చంద్రయాన్‌ –2 ప్రయోగం భారతీయ ప్రతిభకు సజీవ తార్కాణమని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఒక ట్వీట్‌లో ప్రశంసించారు. శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేస్తూ... చంద్రయాన్‌ –2 విజయ వంతం కావడం కోట్లాది మంది భారతీ యులకు లాభం చేకూర్చనుందన్నారు. ‘‘130 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం ఇది. కొన్ని గంటల్లో చంద్రయాన్‌ –2 తుది ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత్‌తోపాటు మిగిలిన ప్రపంచం కూడా మన అంతరిక్ష శాస్త్రవేత్తల అసాధారణ ప్రతిభను మరోసారి ప్రత్యక్షంగా వీక్షించనుంది’’ అని మోదీ ఇంకో ట్వీట్‌లో పేర్కొన్నారు. విక్రమ్‌ సాఫ్ట్‌ల్యాండింగ్‌ను ఆయన బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్‌) ప్రత్యక్షంగా వీక్షించారు. 

దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు, పొరుగుదేశం భూటాన్‌కు చెందిన యువత కూడా తనతోపాటు ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారని... వీరంతా ఇస్రో నిర్వహించిన స్పేస్‌ క్విజ్‌లో తమ ప్రతిభను కనపరచిన వారని మోదీ తెలిపారు. మై గవ్‌ వెబ్‌సైట్‌లో నిర్వహించిన స్పేస్‌ క్విజ్‌లో భారీ సంఖ్యలో యువత పాల్గొనడం అంతరిక్షం, సైన్స్‌ పట్ల దేశ యువతలో ఆసక్తి పెరుగుతోందనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ అపురూప ఘట్టాన్ని దూరదర్శన్‌ శుక్రవారం అర్ధరాత్రి 1.10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టగా ఇస్రో తన వెబ్‌సైట్‌లోనూ కార్యక్రమ లైవ్‌ వీడియోను అందించింది. వీటితోపాటు యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లోనూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను అందించింది ఇస్రో.  ఈ ఏడాది జూలై 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 రాకెట్‌ ద్వారా నింగికి ఎగసిన చంద్రయాన్‌ –2 సుమారు ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన తరువాత ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి జాబిలివైపు ప్రయాణం ప్రారంభించింది. ఆగస్టు 20న జాబిల్లి కక్ష్యలోకి చేరిన తరువాత దశలవారీగా తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సెప్టెంబరు రెండవ తేదీ చంద్రయాన్‌ –2 ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ వేరుపడింది. 


‘గగన్‌యాన్‌’ తొలిదశ ఎంపిక పూర్తి
భారత్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’లో మరో ముందడుగు పడింది. ఈ యాత్రలో పాల్గొనే వ్యోమగాముల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియ తొలిదశ పూర్తయిందని భారత వాయుసేన(ఐఏఎఫ్‌) తెలిపింది. ఈ ప్రక్రియలో ఎంపికైన 25 మంది టెస్ట్‌ పైలెట్లకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌లో శరీరదారుఢ్యంతో పాటు పలువైద్య, మానసిక పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా 2021 డిసెంబర్‌ కల్లా రెండు మానవరహిత, ఓ మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టాలని ఇస్రో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు(వ్యోమనాట్స్‌) రష్యాలోని యూరీగగారిన్‌ కాస్మోనాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 15 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. చివరగా వీరిలో ముగ్గురు వ్యోమగాములు గగన్‌యాన్‌లో భాగంగా అంతరిక్షంలో 7 రోజుల పాటు గడపనున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపిన నాలుగోదేశంగా భారత్‌ చరిత్ర సృష్టించనుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లను కేటాయించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top