కేరళ విపత్తుకు కారణమిదే!

cause of Kerala's calamity! - Sakshi

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, తుపాను పరిస్థితులకు తోడు రుతు పవనాల తీవ్రత కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని నిపుణులు విశ్లేషించారు. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం కన్నా వరుసగా 15%, 18% వర్షాలు ఎక్కువగా కురవగా ఆగస్ట్‌ 1–19 తేదీల మధ్య సాధారణం కన్నా 164% ఎక్కువగా వర్షపాతం నమోదవడం విలయ తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విపరీత పరిస్థితులను వాతావరణ నిపుణులు విశదీకరించారు.

రుతుపవనాలు, తుపాను పరిస్థితులతో పాటు ‘సోమాలీ జెట్‌’ దృగ్విషయం కూడా కేరళలో తీవ్ర వర్షపాతానికి కారణమైందని వారు వివరించారు. మడగాస్కర్‌ ప్రాంతంలో ప్రారంభమై పశ్చిమ కనుమల వైపు వేగంగా వీచే గాలులను సోమాలీ జెట్‌ పవనాలుగా పేర్కొంటారు. ‘ఇప్పటికే కేరళ రాష్ట్రవ్యాప్తంలో రుతుపవనాలు క్రియాశీలంగా ఉన్నాయి. మరోవైపు, ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా కేరళలో, ఉత్తర కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి’ అని ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కైమెట్‌ ఉపాధ్యక్షుడు మహేశ్‌ పాల్వత్‌ వివరించారు.

‘ఆగస్ట్‌ 7, 13 తేదీల్లో ఒడిశా తీరం దగ్గరలో ఏర్పడిన రెండు అల్పపీడనాల వల్ల అరేబియా సముద్ర తూర్పు ప్రాంత మేఘావృత గాలులు పశ్చిమ కనుమలవైపు వచ్చి కేరళ రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షాలకు కారణమయ్యాయి’ భారత వాతవరణ శాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఇలా పలు వర్షపాత అనుకూల పరిస్థితులు ఒకేసారి రావడం వల్ల భారీ వర్షాలు కురవడం, తద్వారా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top