
జిల్లా ఎస్పీ ఆకాశ్ కుల్హరీ చాకచక్యంతో దాదాపు 5 వేల మంది పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
లక్నో : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతోపాటు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో కూడా నిరసనలు ఊపందుకున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో కూడా సీఏఏపై శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే, జిల్లా ఎస్పీ ఆకాశ్ కుల్హరీ చాకచక్యంతో దాదాపు 5 వేల మంది పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. యూనివర్సీటీ క్యాంపస్ నుంచి జిల్లా జడ్జి కార్యాయలం వరకు.. ర్యాలీగా వెళ్తేందుకు ప్లాన్ చేసుకున్న విద్యార్థులపై ఎస్పీ వ్యాఖ్యలు పనిచేశాయి.
(చదవండి : ‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!)
‘ప్రజస్వామ్యయుతంగా నిరసన తెలుపుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. శాంతియుతంగా.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే మీతో పాటు నేనూ ఉంటాను. కానీ, అతిగా ప్రవర్తించి.. మీ నిరసనలో జోక్యం చేసుకునే అవకాశం ఇతరులకు ఇవ్వొద్దు’ అని ఆకాశ్ మైక్‌లో చెప్పారు. ‘మీ వినతి జిల్లా న్యాయమూర్తికి చేరేలా నేను చూసుకుంటాను’అని హామినిచ్చాడు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లా జడ్జికి వినతిని అందించిన విద్యార్థులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇక నిముషంపాటు ఉన్న ఆకాశ్ స్పీచ్ వీడియోపై ప్రశంసలు కురుస్తున్నాయి. అసలైన పోలీసుకు అర్థం చెప్పావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి : ‘అల్లర్లు ఆగకపోతే రాష్ట్రపతి పాలనే’)