నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఏడుగురు వ్యక్తులు మృతిచెందగా, దాదాపు 40 మంది గాయపడ్డారు.
ముంబయి: ఐదు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఏడుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో్ 40 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన ముంబయి సబర్బన్ లోని ఘట్కోపర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు వ్యక్తులను ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భవనం కుప్పకూలిన ఘటనపై విచారణకు ముంబయి మునిసిపల్ కమిషనర్ అజయ్ మెహతా అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సూచించారు.
ఘట్కోపర్ లోని దామోదర్ పార్క్ ఏరియాలో అకస్మాత్తుగా భవనం కూలినట్లు తమకు సమాచారం అందిందని ఓ అధికారి పీఎస్ రహంగ్‌దాలే చెప్పారు. ఎనిమిది ఫైరింజన్లు, అంబులెన్స్ తో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ తో పాటు బీఎంసీ అధికారులు సహయాక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాత్రి 9 గంటల సమయంలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.