రాజకుటుంబ వీరాభిమాని ‘కోహినూర్‌’ మృతి

British Royals Fan From Mumbai Dies - Sakshi

ముంబై: బ్రిటన్‌ రాజవంశానికి వీరాభిమాని, బ్రిటానియా&కో రెస్టారెంట్‌ ఓనర్‌ అయిన బోమన్‌ కోహినూర్‌(93) బుధవారం మృతి చెందాడు. గుండెపోటుతో నిన్న సాయంత్రం 4.45గంటలకు కన్ను మూసినట్లు పార్సీ జనరల్‌ ఆస్పత్రి అధికారి తెలిపారు. బ్రిటానియా రెస్టారెంట్ ఓనర్‌గా కొద్ది మందికి మాత్రమే తెలిసిన బోమన్‌ కోహినూర్‌.. 2016లో ఆకస్మాత్తుగా దేశం అంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో ఇండియా-భూటాన్‌ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ వచ్చిన ప్రిన్స్‌ విలియమ్స్‌ దంపతులు ప్రత్యేకంగా ముంబై వెళ్లి బోమన్‌ని కలుసుకున్నారు. ఈ సంఘటనతో బోమన్‌కు ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. బోమన్‌ కోహినూర్‌ తండ్రి 1923లో ముంబైలో బ్రిటానియా&కో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఊహ తెలిసిన నాటి నుంచి కోహినూర్‌ జీవితం ఆ రెస్టారెంట్‌కు అంకితమయ్యింది. చిన్ననాటి నుంచి కోహినూర్‌ బ్రిటన్‌ రాజవంశం పట్ల వల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నాడు. ఎంతలా అంటే బోమన్‌ రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టిన వారికి ముందుగా క్వీన్‌ ఎలిజబెత్‌ II, మహాత్మగాంధీ నిలువెత్తు ఫోటోలు దర్శనమిస్తాయి.

అంతేకాక కోహినూర్‌ ప్రతి ఏడాది క్వీన్‌ ఎలిజబెత్‌ IIకు ప్రత్యేక సందర్భాల్లో ఉత్తరాలు రాస్తుంటాడు. రాజ ప్రసాదం నుంచి క్వీన్‌ ప్రతినిధులు ఆమె తరఫున ప్రత్యుత్తరం కూడా పంపుతారు. కోహినూర్‌కు రాజ కుటుంబం అంటే ఎంత అభిమానం అంటే.. తన మనవరాలికి ఏకంగా ప్రిన్స్‌ విలియమ్స్‌ తల్లి డయానా పేరు పెట్టాడు.  కోహినూర్‌ మరణం పట్ల నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రియమైన బొంబాయి వాసి ఇక లేరని తెలిసి బాధగా ఉందంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top