చంద్రబాబుపై ట్వీట్‌ చేసిన రాంమాధవ్‌

BJP Leader Ram Madhav Reaction on Karntaka Assembly Results - Sakshi

 ఏపీ ముఖ్యమంత్రిపై బీజేపీ నేత  రాం మాధవ్‌ ట్వీట్‌

చంద్రబాబును తిప్పికొట్టిన కన్నడ ప్రజలు

దక్షిణాదిన బీజేపీ హవా మొదలైంది

సాక్షి,న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసంపై బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌  కర్ణాటకలో బీజేపీ ప్రభంజనంపైస్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు.  బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా ఆయన ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో  బీజేపీకి గత ఎన్నికలతోపోలిస్తే 6నుంచి 20కిపైగా సీట్లు పెరిగాయన్నారు. అంతేకాదు దక్షిణాదిలో తమ విజయ దుందుభి మొదలైందంటూ ట్వీట్‌ చేశారు.

కన్నడ నాట బీజేపీ విజయానికి ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు స్థానిక నాయకత్వం చేసిన కృషి ఫలించిందన్నారు. ముఖ్యంగా మోదీ చరిష్మా, అమిత్ షా వ్యూహాలు  బీజేపీని గెలిపించాయన్నారు.  సిద్దరామయ్య ప్రభుత్వం పై వ్యతిరేకతకు తోడు నిర్ణయాత్మక తీర్పు ఇవ్వాలన్న తమ విజ్ఞప్తిని ప్రజలు అంగీకరించారన్నారు.  కర్ణాటక బీజేపీ నాయకులు ఐకమత్యంతో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన పరిస్థితి ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదనీ,  చంద్రబాబు వాదాన్ని కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని  పేర్కొన్నారు. కులం, వారసత్వం, డబ్బు రాజకీయాలకు భిన్నంగా ఏపిలో నూతన రాజకీయాలను తీసుకొస్తామని రాం మాధవ్‌  స్పష‍్టం చేశారు.  రైతులు, దళితులకు  తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదనీ,  ఇది కేవలం విపక్షాల దుష్ప్రచారమేనని  ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్లు, టెంట్లతో ఒరిగేదేమీ లేదనీ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమదే  విజయమన్న ధీమాను ఆయన వ్యక‍్తం చేశారు.

మరోవైపు ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, మరో సీనియర్‌ నేత పురందేశ్వరి కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  రాష్ట్రంలో సిద్ధరామయ్య  మహిళా వ్యతిరేక విధానాలను ప్రజలు తిరస్కరించారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ పార్టీ ఎలా పని చేసిందో తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే ముందుకు వెళతామని ఆమె తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top