
కమిలిన కమలం
లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని ఒక ఊపు ఊపి సంచలనం సృష్టించిన కమలనాథులకు ఊహించని షాక్ ఇది.
- ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ
- 24 సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకుగాను 10 సీట్లలోనే గెలుపు
- యూపీలో సమాజ్‌వాదీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా
- గుజరాత్‌లో కమలనాథులకు ఊరట
- మోదీ స్థానం వడోదరలో బీజేపీకి భారీగా తగ్గిన మెజారిటీ
- 3 లోక్‌సభ స్థానాల్లో ఒక్కోటి చొప్పున దక్కించుకున్న
- బీజేపీ, సమాజ్‌వాదీ, టీఆర్‌ఎస్
- ఫలితాలు వెలువడిన 32 అసెంబ్లీ స్థానాలకు
- బీజేపీకి 12, ఎస్పీకి 8, కాంగ్రెస్‌కు 7
- ఒక్కో అసెంబ్లీ స్థానం చొప్పున దక్కించుకున్న
- టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్
- సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
- 20న వెలువడనున్న ఆంటాగఢ్ అసెంబ్లీ స్థానం ఫలితాలు
- సీనియర్లను పక్కనపెట్టిన ఫలితమే: బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా
ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని ఒక ఊపు ఊపి సంచలనం సృష్టించిన కమలనాథులకు ఊహించని షాక్ ఇది. అధికారం చేపట్టిన తర్వాత అతికొద్ది కాలంలోనే జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కూడా కనిపించలేదని స్పష్టమవుతోంది. ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో మొన్నటివరకు తమ చేతిలో ఉన్న 24 అసెంబ్లీ సీట్లలో(1 మిత్రపక్షం) 14 సీట్లను బీజేపీ ఇప్పుడు కోల్పోయింది.
20న ఆంటాగఢ్ ఫలితాలు..
సోమవారం ఫలితాలు వెలువడిన 9 రాష్ట్రాల్లోని 32 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 12 గెలుచుకోగా.. కాంగ్రెస్ ఏడు, సమాజ్‌వాదీ పార్టీ 8, టీడీపీ, ఏఐయూడీఎఫ్, టీఎంసీ, సీపీఎంలు ఒక్కో స్థానం చొప్పున దక్కించుకున్నాయి. సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, ఎస్పీలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి. ఆ పార్టీల స్థానాలు ఆ పార్టీలకే దక్కాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఆంటాగఢ్ స్థానం ఫలితాలు ఈ నెల 20న వెలువడతాయి. ఎన్నికల ఫలితాలు మోదీకి పరీక్ష కాదని బీజేపీ పేర్కొంటున్నప్పటికీ, ప్రతికూల ఫలితాలపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందంటున్నాయి. యూపీ, రాజస్థాన్‌లో ఫలితాలు బీజేపీని నిరుత్సాహానికి గురిచేయగా, గుజరాత్‌లో ఆరు స్థానాల్లో గెలవడం, బెంగాల్‌లో ఖాతా తెరుచుకోవడం కొంత ఊరటనిచ్చింది.
యూపీలో దూసుకెళ్లిన సమాజ్‌వాదీ పార్టీ...
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్లింది. సార్వత్రిక ఎన్నికల్లో 73 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ప్రతికూలంగా రావడం కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉప ఎన్నిక జరిగిన 11 స్థానాల్లో 10 స్థానాలు బీజేపీ అభ్యర్థులు, 1 బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ ఖాళీ చేసినవే. ఈ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలు ఎస్పీ ఖాతాలోకి వెళ్లాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి తేజ్‌ప్రతాప్ సత్తాచాటుకున్నారు. నోయిడా, సహరన్‌పుర్, తూర్పు లక్నో అసెంబ్లీ స్థానాల్లో కమలం వికసించగా, బిజ్నోర్, ఠాకుర్‌ద్వారా, నిఘాసన్, హమీర్‌పుర్, చర్‌ఖారి, సిరాథు,బల్హా, రొహానియా అసెంబ్లీల్లో ఎస్పీ అభ్యర్థులు గెలిచారు.
గుజరాత్‌లో బీజేపీకి ఊరట..గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చింది. అక్కడ క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న బీజేపీ కలలు కల్లలయ్యాయి. 9 అసెంబ్లీను గెలిపించి ప్రధాని మోదీకి జన్మదిన కానుక ఇవ్వడానికి ఆ రాష్ట్ర సీఎం ఆనంది చేసిన హామీ చావుతప్పి కన్నులొట్టపోయినట్టుగా మారింది. ఫలితాలు మాత్రం బీజేపీకి కొంత ఊరటనిచ్చాయి. వడోదర లోక్‌సభతో పాటు, మనినగర్, టంకారా, తేలాజా, ఆనంద్, మటర్, లిమ్‌ఖేడా అసెంబ్లీను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోగా, దీసా, ఖంభాలియా, మంగ్రోల్‌లలో కాంగ్రెస్ గెలిచింది.. మోదీ ఖాళీ చేసిన వ డోదరలో బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్.. కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్రపై 3.29 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో ఈ స్థానాన్ని మోదీ 5.7 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా..రాజస్థాన్‌లోని అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానం (దక్షిణ కోటా నియోజకవర్గం)లో గెలుపొందగా, మిగిలిన మూడు స్థానాలు.. సూరజ్‌గర్హ, వుయీర్, నసీరాబాద్ అసెంబ్లీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈశాన్యంలోనూ కమలానికి ప్రతికూల ఫలితాలొచ్చాయి. త్రిపురలోని మను అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకోగా, సిక్కింలోని రామ్‌గంగ్-యాన్‌గంగ్ అసెంబ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అస్సాంలో సిలిచర్‌లో బీజేపీ, లఖీపుర్‌లో కాంగ్రెస్, జమునాముఖ్‌లో ఏఐయూడీఎఫ్ గెలిచాయి.
పశ్చిమబెంగాల్‌లో ఖాతా తెరిచిన బీజేపీ
బెంగాల్‌లోని చౌరంగి నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందగా, దక్షిణ బషీర్‌హాట్ స్థానం టీఎంసీకి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య గెలుపొందారు. తెలంగాణలోని మెదక్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి కైవసం చేసుకున్నారు.