
నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతూ బిహార్‌లో 166 గ్రూప్ డీ పోస్టులకు ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి.
పట్నా : బిహార్‌లో 166 గ్రూప్ డీ పోస్టులకు ఐదు లక్షల మందికిపైగా దరఖాస్తు చేయడంపై విపక్షాలు భగ్గుమనడంతో బిహార్ మంత్రి శ్రవణ్ కుమార్ స్పందించారు. విపరీతమైన పోటీ నెలకొనడంతో యువత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పలానా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఎవరికీ చెప్పదని, ప్రతిభ కలిగిన దరఖాస్తుదారులను ఎంపిక చేయడమే ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.బిహార్ విధాన సభలో 166 గ్రూప్ డీ పోస్టులకు గ్రాడ్యుయేట్లు, పీజీలు, ఎంబీఏ, ఎంసీఏ గ్రాడ్యుయేట్లు 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేయడం పట్ల బీజేపీ-జేడీ(యూ) కూటమి సర్కార్‌పై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో తీవ్ర నిరుద్యోగ సమస్యకు ఇది అద్దం పడుతోందని దుయ్యబట్టాయి.