ట్రోల్‌ అవుతోన్న ‘బహీఖాతా’

Bhahi-Khata Troll In Social Media - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేను బడ్జెట్‌ డాక్యుమెంట్లను తీసుకొచ్చేందుకు లెదర్‌బ్యాగ్‌ని ఎందుకు ఉపయోగించలేదంటే, బ్రిటిష్‌ వలసవాదాన్ని వదిలించుకోవడానికే. మన ప్రత్యేకతను చాటడానికి ఇదే సరైన సమయమని భావించా. అలాగే ఇది మోయడం సులువుగా ఉంటుంది.
-నిర్మలా సీతారామన్‌, ఆర్థికమంత్రి

నిర్మలా సీతారామన్‌, దేశ చరిత్రలో ఆర్థిక శాఖ పూర్తిస్థాయి కేబినేట్‌ మహిళా మంత్రిగా తొలిసారిగా పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మన దేశంలో బడ్జెట్‌ సమర్పణ ప్రక్రియ మొత్తం బ్రిటిష్‌ సంప్రదాయాలకు అనుగుణంగానే సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రిటన్‌ ప్రభుత్వాలు సైతం బడ్జెట్‌ సంప్రదాయాలు కొన్నింటిని మార్చుకుంటున్నప్పటికీ భారత్‌లో మాత్రం 1860లనాటి బ్రిటిష్‌ సంప్రదాయం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఉదాహరణకు బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్‌ ప్రసంగ పత్రాన్ని తీసుకురావడం అనేది బ్రిటిష్‌ సంప్రదాయ చరిత్రకు కొనసాగింపుగానే ఉంటోంది. బడ్జెట్‌ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి చేతిలో బ్రీఫ్‌కేస్‌తో ఫోటో దిగడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే ఈసారి మన ఆర్థికమంత్రి బ్రీఫ్‌కేస్‌తో గాక జాతీయ చిహ్నంగల ఎరుపురంగు చేతిసంచితో ప్రత్యక్షమైంది. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇదివరకటి భారతీయ ప్రభుత్వాలు మోసుకొస్తున్నబానిసత్వ వలసపాలన వారసత్వానికి నిర్మలాసీతారామన్‌ నేటితో చరమగీతం పాడారని కొందరు అంటుంటే, మరి అన్ని విషయాలలోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దమ్ముందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆర్థికమంత్రి ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది మన భారతీయ సంప్రదాయం, పశ్చిమదేశాల బానిసత్వ గుర్తులను వదిలివేస్తున్నామని అన్నారు. అయితే దీనిపై ఓ వ్యంగ్య ట్విటర్‌ స్పందించాడు. మరి ఆ భారతీయ సంప్రదాయ సంచిలో ఉన్న బడ్జెట్‌ ప్రతులు తాటాకుల మీద ముద్రించారా?.. నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు ఎడ్లబండి మీద వచ్చిందా? అంటూ ట్వీట్లు గుప్పించాడు. ఏమైతేనేం ఇప్పటికే పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన మన ఆర్థిక మంత్రి ఇంగ్లిష్‌ స్టైల్‌ బ్రీఫ్‌కేస్‌ స్థానంలో భారతీయ సంప్రదాయం తొణికిసలాడేలా ఆమె మాటల్లో ‘బహిఖాతా’(పద్దుల పుస్తకం)ను ప్రవేశపెట్టి తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top