
కోల్‌కతా : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మిఠాయి వాలాలకు మరో తీపి కబురు అందించారు. బెంగాల్ స్వీట్లకు డిమాండ్ ఎక్కువ. లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యవసరాలు, అత్యవసర సేవలు మినహా అన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఇది వరకు 4 గంటలపాటు మాత్రమే మిఠాయి దుకాణాలను తెరుచుకునేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా మరో 4 గంటలు పెంచింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మిఠాయి వ్యాపారులు దుకాణాలను తెరిచి వ్యాపారం చేసుకోవచ్చని శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం వెలువడ్డ ఉత్తర్వులతో ఆయా ప్రాంతాల్లోని మిఠాయి దుకాణదారులందరూ ముఖ్యమంత్రి మమతకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బెంగాల్ లో ఇప్పటివరకు 255 కరోనా కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అలాగే 10 మంది కరోనా కారణంగా మరణించినట్లు సమాచారం.