బ్యాక్టీరియాకు.. బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌!

Bad Time For Bacteria - Sakshi

ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి నరుక్కురమ్మన్నారనేది సామెత.. యాంటీబయాటిక్‌ మందుల విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది.. ఉన్న మందులకు అలవాటు పడిన బ్యాక్టీరియాలు ఒక పట్టాన చావమంటున్నాయి.. కొత్తవాటి తయారీకి బ్రేకులు పడి ఏళ్లు గడిచిపోతున్నాయి..   దీంతో శాస్త్రవేత్తలు రూటు మార్చేశారు. అటు నుంచి చెక్‌ పెట్టే సరికొత్త మందును సిద్ధం చేశారు! యాంటీబయాటిక్‌ నిరోధకత.. ఈ మధ్యకాలంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతిపెద్దది అనడంలో సందేహం లేదు. అంతెందుకు.. దీని కారణంగా 2050 నాటికి కోటి మంది ప్రాణాలు కోల్పోతారంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్‌ ఫార్మా సంస్థ షియొనోగి ఓ శుభవార్తను మోసుకొచ్చింది. ‘సెఫీడెరొకాల్‌’పేరుతో ఈ సంస్థ అభివృద్ధి చేసిన సరికొత్త యాంటీబయాటిక్‌ మొండి బ్యాక్టీరి యాలను కూడా నాశనం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.  

ఏంటి ఈ కొత్త మందు ప్రత్యేకత?
సెఫీడెరొకాల్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే మనం జబ్బు పడ్డప్పుడు శరీరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా ఇన్ఫె క్షన్‌ సోకినప్పుడు ముందుగా మన రోగ నిరోధక వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. ఇది రకరకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది. శరీరంలోని ఇనుము మోతాదును తగ్గించడం ఇందులో ఒకటి. రోగ నిరోధక వ్యవస్థ ఈ చర్యకు దిగిన వెం టనే బ్యాక్టీరియా కూడా స్పందిస్తుంది. అందుబాటులోని ఇనుమును వేగంగా తీసుకోవడం మొదలుపెడుతుంది. షియొనోగి శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని సెఫీడెరొకాల్‌ను సిద్ధం చేశా రు. ఇనుము అణువుల్లోపల యాంటీబయాటిక్‌ మందును చేర్చారు. బ్యాక్టీరియా ఈ అణువులను లోపలికి చేర్చుకోగానే... సెఫీడెరొకాల్‌ పని మొదలుపెడుతుంది. లోపలి నుంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. గ్రీకు పురాణాల్లో చెప్పినట్లు చెక్క గుర్రాల్లోపల యోధులను ఉంచి.. ట్రాయ్‌ నగరంపై దం డెత్తినట్లు అన్నమాట!

73% సక్సెస్‌..
షియొనోగి ఇటీవలే సెఫీడెరోకాల్‌ను 448 మందిపై ప్రయోగించి చూశారు. మూత్రపిండాల, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిపై ఈ మం దు ప్రయోగించగా దాదాపు 73% మంది స్పందించారని, ప్రస్తు తం మార్కెట్‌లో అం దుబాటులో ఉన్న శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ కంటే ఇది చాలా ఎక్కువని షియొనొగి తెలిపింది. దాదాపు 15 దేశాలు, 67 ఆసుపత్రుల్లో జరిగిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చినప్పటికీ విస్తృత స్థాయిలో ప్రయోగాలు జరిగితేగానీ.. ఈ మందును అందుబాటులోకి తేలేమన్నది నిపుణుల మాట. సెఫీడెరొకాల్‌ లాంటి వినూత్న మం దులు మరిన్ని అభివృద్ధి చేస్తే యాంటీబయాటిక్‌ నిరోధకతకు మెరుగైన పరిష్కారం లభిస్తుందని వీరు అంటున్నారు.   

  • అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ సుమారు 90 ఏళ్ల క్రితం పెన్సిలిన్‌ రూపంలో తొలి యాంటీ బయాటిక్‌ను తయారు చేశారు.
  • పెన్సిలిన్‌ లాంటి యాంటీ బయాటిక్‌లకూ లొంగని బ్యాక్టీరియా ఏటా 7 లక్షల మంది ప్రాణాలు తీస్తోంది.
  • అవసరం లేకపోయినా యాంటీబయాటిక్‌లు వాడాలని సూచిస్తున్నది.. మొత్తం ప్రిస్క్రిప్షన్లలో 20%
  • అవసరానికి మించి వాడటం వంటి కారణాలతో ఏ మందుకూ లొంగని సూపర్‌ బగ్‌లు ఎక్కువ అవుతున్నాయి.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 12 రకాల బ్యాక్టీరియాలతో మనిషికి ముప్పు ఎక్కువ!
  • గత 30 ఏళ్లలో మార్కెట్‌ లోకి వచ్చిన యాంటీ బయాటిక్‌లన్నీ పాతవాటిలో మార్పులు, చేర్పులు చేసి సిద్ధం చేసినవే! 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top