భూమికి సమీపంగా ఉల్క

Asteroid 2012 TC4 flew 'damn close' to Earth today

శాస్త్రవేత్తల ఉలికిపాటు

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ : శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగానే ‘2012 టీసీ4’ ఉల్క భూమికి సమీపంగా దూసుకెళ్లింది. అంటార్కిటికా మీదుగా  గురువారం ఈ శకలం భూమిని దాటుకుంటూ వెళ్లిపోయింది. ఐదేళ్ల క్రితం అమెరికాలోని హవాయి హలియకల అబ్జర్వేటరీలోని పాన్‌–స్టార్స్‌ టెలిస్కోప్‌ ద్వారా ‘2012 టీసీ4’ను శాస్త్రవేత్తలు గుర్తించారు.  ఆ తర్వాత ఈ శకలం సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అదృశ్యమైంది. మళ్లీ ఈ ఏడాది జూలైలో చంద్రుని కక్ష్యలో కనిపించింది.   

భూమికి ఎంత దగ్గరగా...
యాభై నుంచి వంద అడుగుల పరిమాణంలో ఉన్న ఈ శకలం గంటకు దాదాపు 16,000 మైళ్ల వేగంతో అంటే సెకనుకు 4.5 మైళ్ల వేగంతో అంటార్కిటికాకు 27 వేల మైళ్ల ఎత్తు నుంచి దూసుకెళ్లింది. ఇది ఎంతో దూరంలో ఉంది కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంతరిక్ష ప్రమాణాల ప్రకారం భూమి–చంద్రుడి మధ్యలో ఎనిమిదో వంతు దూరంలోనే ఉన్నట్లుగా భావించాలి. ‘ఇది భూమికి చాలా దగ్గరగా వచ్చింది.  ఈ శకలం వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ..ఉల్కలను కనుగొనడం, అంతరిక్ష భద్రతకు ఏ మేరకు సిద్ధమై ఉన్నామనే దానికి దీన్ని సవాలుగా భావించవచ్చు’ అని జర్మనీలోని యూరోపియన్‌ అంతరిక్ష వ్యవహారాల కేంద్రం చీఫ్‌ రోల్ఫ్‌ డెన్సింగ్‌ చెబుతున్నారు.  దాదాపు 6.5కోట్ల ఏళ్ల క్రితం మెక్సికో తీర ప్రాంతాన్ని ఓ ఉల్క ఢీకొట్టడంతో భూమిపై డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయిన విషయాన్ని, 2013లో రష్యాలోని ఛెల్యాబిన్స్‌క్‌పై 10 టన్నుల బరువున్న శకలం ముక్కలై పడటంతో వెయ్యి మంది గాయపడ్డ ఘటనను ఆయన గుర్తుచేశారు.  

ఎదుర్కోగలమా ?
‘భూమిపై పడే ఉల్క లేదా గ్రహ శకలాన్ని ఉపగ్రహంతో పేల్చేసే సామర్థ్యం మనకుంది. 2004లో ‘డీప్‌ ఇంపాక్ట్‌’ మిషన్‌ సందర్భంగా నాసా అదే చేసింది. ఇటువంటి ఉల్కలను గురి చూసి కొట్టడం కొంత కష్టం. పెద్ద పరిమాణంలో ఉన్న శకలాన్ని గుర్తించడంతో పాటు సరిగ్గా మధ్యలో రాకెట్‌తో ఢీకొట్టించడమన్నది కొంతమేర సవాలుగా నిలిచినప్పటికీ, 100 నుంచి 200 మీటర్ల వైశాల్యమున్న శకలాల్ని మాత్రం పేల్చేసేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధంగానే ఉన్నాయి’ అని  శాస్త్రవేత్త డెట్‌లెఫ్‌ చెప్పారు. ‘2012 టీసీ4’ భూమికి సమీపంగా వెళ్లినప్పుడు అంతర్జాతీయ గ్రహశకలాల హెచ్చరిక నెట్‌వర్క్‌లో ద్వారా ప్రపంచంలోని అబ్జర్వేటరీలు పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవడంతో పాటు సమన్వయంతో పనిచేశాయి.
    –

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top