ఆసియాన్‌తో అనుబంధానికి ప్రణాళిక | ASEAN Regional Forum meeting at Myanmar gives hope to India | Sakshi
Sakshi News home page

ఆసియాన్‌తో అనుబంధానికి ప్రణాళిక

Aug 10 2014 2:32 AM | Updated on Sep 2 2017 11:38 AM

ఆసియాన్‌తో అనుబంధానికి ప్రణాళిక

ఆసియాన్‌తో అనుబంధానికి ప్రణాళిక

ఆసియాన్ దేశాలతో విభిన్న రంగాల్లో భారత సంబంధాలు, సహకారాలను మెరుగుపరచేందుకు 2016 నుంచి అమలయ్యేలా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని భారతదేశం పేర్కొంది.

12వ ఆసియాన్ సమావేశంలో సుష్మాస్వరాజ్ వెల్లడి
 
నేపితా: ఆసియాన్ దేశాలతో విభిన్న రంగాల్లో భారత సంబంధాలు, సహకారాలను మెరుగుపరచేందుకు 2016 నుంచి అమలయ్యేలా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని భారతదేశం పేర్కొంది. ఆసియాన్‌కు భారత్‌కు మధ్య సేవలు, పెట్టుబడుల రంగాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ నెలలో జరగబోయే ఆర్థిక, వాణిజ్య మంత్రుల సమావేశంలో ఖరారవుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మయన్మార్‌లోని నేపితా నగరంలో శనివారం జరిగిన 12వ ఇండియా - ఆసియాన్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.

ఆసియాన్ దేశాల బృందంతో సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. ఆసియాన్ దేశాల మధ్య భౌగోళిక, సంస్థాగత, ప్రజా సంబంధాలు నెలకొనాలని భారత్ కాంక్షిస్తోందన్నారు. విదేశీ విధానంలో సంస్కృతి, నైపుణ్యం, పర్యాటకం, వాణిజ్యం, సాంకేతిక - (ట్రెడిషన్, టాలెంట్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీ - ఐదు ‘టీ’లు) ప్రాధాన్యం గల అంశాలని.. వీటన్నిటికన్నా ముందు ఒక ‘సీ’ - కనెక్టివిటీ (అనుసంధానం) అనేది ముఖ్యమని సుష్మా పేర్కొన్నారు.

అంతర్జాతీయ చట్టాలను పాటించాలి...

దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా సుష్మాస్వరాజ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. సముద్ర చట్టంపై 1982 ఐక్యరాజ్యసమితి ఒప్పందం సహా అంతర్జాతీయ చట్టాల సూత్రాలకు అనుగుణంగా సముద్రయాన స్వేచ్ఛకు, వనరుల అందుబాటుకు భారత్ మద్దతిస్తుందని పేర్కొన్నారు.  వియత్నాం తనకు చెందినవిగా చెప్తున్న పారాసెల్ దీవులకు సమీపంలోని సముద్ర జలాల్లో చైనా ఆయిల్ రిగ్‌ను మోహరించటంతో ఈ అంశంపై వివాదం తలెత్తింది. దక్షిణ చైనా సముద్రంలో భారత్‌కు చెందిన ఓఎన్‌జీసీ విదేశ్ (ఓవీఎల్) చమురు బ్లాకులను నిర్వహిస్తోంది. ఈ వివాదాస్పద జలాల్లో భారత్ చమురు అన్వేషణ ప్రాజెక్టులకు చైనా అభ్యంతరం వ్యక్తంచేస్తోంది.

ఏడు దేశాల విదేశీ మంత్రులతో సుష్మా చర్చలు

ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో.. చైనా, ఆస్ట్రేలియా, కెనడా, వియత్నాం, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ దేశాల విదేశాంగ మంత్రులతో సుష్మాస్వరాజ్ విడివిడిగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. వియత్నాం మంత్రి ఫాంబిన్‌మిన్‌తో భేటీలో.. దక్షిణ చైనా సముద్రం అంశంతో పాటు, ఇంధన భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించుకునే అంశాన్నీ చర్చించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్‌తో భేటీలో.. పౌర అణు ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయాలని ఇరు పక్షాలూ నిర్ణయించాయని.. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement