ఢిల్లీ మహిళలకు ‘ఉచితమేనా’ ప్రయాణం

Arvind Kejriwal Launches New Scheme Free Bus Ride Women In DTC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలనే స్కీమ్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ మంగళవారం నాటి నుంచి అధికారికంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. ఢిల్లీ మహిళలకు పెద్దన్నలా చెప్పుకునే కేజ్రివాల్‌. సోదరి–సోదరుల అనుబంధానికి గుర్తుగా జరపుకునే ‘భాయ్‌ దూజ్‌’ పండుగ నాడు ప్రారంభించడం ఓ విశేషం. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కేజ్రివాల్‌ ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని విపక్షాలు గోల చేస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ మోదీ, రైతులకు ఆరేసి వేల రూపాయల చొప్పున రెండు విడతల ఆర్థిక పథకాన్ని ప్రకటించలేదా?! మన ప్రజా నాయకులు మామూలప్పుడు ఎలాగు ప్రజలను పట్టించుకోరు, కనీసం ఎన్నికలప్పుడైనా ప్రజలకు మేలు చేయడాన్ని ఎందుకు కాదనాలి! పథకాన్ని ఎప్పుడు ప్రకటించారన్న విషయాన్ని పక్కన పెట్టి పథకంలో మంచి, చెడులను గురించి ఆలోచించడమే ఎప్పుడైనా మంచి పద్ధతి.

ఢిల్లీని రెండు ప్రధాన సమస్యలు వేధిస్తున్న నేపథ్యంలో మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యం స్కీమ్‌ మంచిదని చెప్పవచ్చు.  ఒకటి, మహిళలకు భద్రత లేకుండా పోవడం. రెండు, వాయు కాలుష్యం సమస్య. చీకట్లోనే కాకుండా, పగలు కూడా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల బస్సుల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో మహిళల సంఖ్య, సందడి పెరుగుతుంది. ఒకరికి, నలుగురు తోడవడం వల్ల వేధింపులు తగ్గుతాయి. ఆడ పిల్లలకు భద్రతగా తల్లులు కూడా వెంట వెళ్ల వచ్చు. ఈ రోజుల్లో తల్లులు వెంట రావడం ఆడ పిల్లలకు ఇష్టం లేకపోవచ్చు. అది వేరే విషయం. బస్సుల్లో మహిళలకు ర„ý ణగా 13 వేల మంది మార్షల్స్‌ను రంగంలోకి అదనంగా దించుతున్నట్లు కూడా కేజ్రివాల్‌ మంగళవారం ప్రకటించారు. దాని వల్ల కూడా భద్రత మరింత పెరుగుతుంది. 

రెండో సమస్య కాలుష్యం. బస్సు రవాణా సదుపాయం పెరగడం వల్ల ప్రైవేటు వాహనాల సంఖ్య తగ్గుతుందనే విషయం తెల్సిందే. ఉచిత ప్రయాణం కారణంగా ఆడ పిల్లలను స్కూళ్ల వద్దనో, కాలేజీల వద్దనో దించి వచ్చే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కార్లు ఎక్కువగా తగ్గకపోవచ్చు. సరదాగా స్నేహితులతో కలిసి బస్సుల్లో వెళ్తే బాగుంటుంది అనుకునే ఆడ పిల్లలు కార్లలో ప్రయాణాన్ని కాదనుకోవచ్చు. ‘ఈ నిర్ణయం మాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని ప్రాంతాలు తిరగాలనుకుంటున్నాం. విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకు అవసరమైయ్యే డబ్బులను కూడ బెట్టాలనుకుంటున్నాం’ అని బస్సుల్లో ఉచితంగా ప్రయణిస్తున్న ఆడ పిల్లలు చెప్పారు. వారు ఉల్లాసంగా తమకు కండక్టర్‌ ఇచ్చిన గులాబీ రంగు టిక్కెట్లు చూపించారు. 

ఈ గులాబీ టిక్కెట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఒక గులాబీ రంగు టిక్కెట్‌ విలువ పది రూపాయలనుకుంటే అలాంటివి రోజుకు ఎన్ని, నెలకు ఎన్ని, ఏడాదికి ఎన్ని జారీ చేశారో లెక్కించి ఆ డబ్బుల మొత్తాన్ని రాష్ట్ర బస్సు కార్పొరేషన్‌కు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌ విజయవంతం అయితే సీనియర్‌ సిటిజెన్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తానని కేజ్రివాల్‌ ఇప్పటికే హామీ ఇచ్చారు. దీని విజయం కండక్టర్ల నిజాయితీ, వారిపై నిఘా నీడలు ఎలా ఉంటాయన్న దాని మీద ఆధార పడి ఉంది. అంతేకాకుండా ఉచిత ప్రయాణం కారణంగా బస్సుల సంఖ్య మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఈ బస్సు రవాణా వ్యవస్థ అదనపు ఒత్తిడిని ఎలా తట్టుకుంటుందనే విషయంపై కూడా విజయం ఆధారపడి ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top