
పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: కేజ్రీవాల్
సర్జికల్ దాడులపై పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో తిప్పికొట్టాలని అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.
న్యూఢిల్లీ: సర్జికల్ దాడులపై పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో తిప్పికొట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. దాడులపై పాక్ దుష్ప్రచారాన్ని బయటపెట్టిన మీడియాను సీఎం అభినందించారు. ‘‘పలు మీడియా సంస్థలు పాకిస్థాన్ తప్పుడు ప్రచారాన్ని బహిర్గతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. వారిని నా అభినందనలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరిగానే పాక్ దుష్ప్రచారాన్ని అంతర్జాతీయ స్థాయిలో తిప్పికొట్టాలి’’ అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఓ అధికారి తమ భూభాగంలో సర్జికల్ దాడులు జరిగినట్లు ఒప్పుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలను కేజ్రీవాల్ ఉటంకించారు. సర్జికల్ దాడుల అనంతరం సోమవారం ఓ వీడియో మెసేజ్ విడుదల చేసిన సీఎం కేజ్రీవాల్ అందులో పాకిస్థాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని కేజ్రీవాల్ కోరినట్లు వచ్చిన వార్తలు దుమారం రేపాయి. దీనిపై పలు మార్లు సీఎం, ఆప్ నేతలు వివరణలు ఇచ్చినా బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మరోసారి సర్జికల్ దాడులపై స్పందించారు.
So happy that some media exposing Pak's false propaganda. I congratulate them. Urge Indian govt to likewise expose Pak internationally https://t.co/LGvNJWPxzX
— Arvind Kejriwal (@ArvindKejriwal) 6 October 2016