మాజీ సీఎం అనుమానాస్పద మృతి
అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కలిఖో పుల్ (48) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
	ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కలిఖో పుల్ (48) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఇంట్లోనే శవమై కనిపించారు. ఉరి వేసుకుని ఆయన మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని  అనుమానిస్తున్నారు. రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే ఆయన బలవన్మరణానికి పాల్పడివుండొచ్చని భావిస్తున్నారు. ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, కుంగుబాటు కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని హోంశాఖ అధికారులు తెలిపారు.
	
	
	గత నెలలో ఆయన పదవి కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్ కు ఆయన 145 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 19 నుంచి జూలై 13 వరకు సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సాయంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి దక్కించుకున్నారు. రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు ప్రకటన వెలువడిన కాసేపటికే ఫిబ్రవరి 19న అర్థరాత్రి సీఎంగా పుల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కేంద్రం తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పుల్ పదవి కోల్పోయారు.
	
	కలిఖో పుల్ మరణం పట్ల మాజీ సీఎం నబమ్ తుకీ సంతాపం ప్రకటించారు. పుల్ ఆత్మహత్య చేసుకోవడం బాధకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
