రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.2,49,435 కోట్లు | AP State government debt is Rs 249435 crore | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.2,49,435 కోట్లు

Jun 26 2019 5:11 AM | Updated on Jun 26 2019 5:38 AM

AP State government debt is Rs 249435 crore - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అప్పు 2018–19 ఆర్థిక సంవత్సరం నాటికి బడ్జెట్‌ అంచనాల మేరకు రూ.2,49,435 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. 2015 మార్చి మాసాంతానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.1,48,743 కోట్లు ఉండగా.. 35 శాతం పెరిగి 2017 మార్చి మాసాంతానికి రూ.2,01,314 కోట్లకు చేరిందని వివరించారు. ద్రవ్య బాధ్యత, విత్త నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిని మించి 2016–17లో ఉదయ్‌ స్కీమ్‌ ద్వారా రూ.8,256 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.2,01,314 కోట్ల అప్పు ఉండగా.. వడ్డీ చెల్లింపులు రూ.12,292 కోట్లుగా ఉన్నాయన్నారు. అలాగే 2017–18 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పు రూ.2,25,234 కోట్లకు చేరుకోగా.. వడ్డీ చెల్లింపు రూ.14,756 కోట్లకు చేరుకుందని వివరించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో అప్పు రూ.2,49,435 కోట్ల మేర ఉండగా.. వడ్డీ చెల్లింపు రూ.15,077 కోట్లుగా ఉందన్నారు. కాగా, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 కింద మూడేళ్లలో ఏపీకి రూ.7,891 కోట్ల నిధులు విడుదల చేసినట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఎంపీ కేవీపీ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.

కోస్టల్‌ సర్క్యూట్‌లో 75% పనులు పూర్తి
నెల్లూరు జిల్లాలో కోస్టల్‌ సర్క్యూట్‌ అభివృద్ధి ప్రాజెక్ట్‌ ద్వారా స్వదేశ్‌ దర్శన్‌ స్కీమ్‌ కింద 2015–16లో రూ.59.70 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ కింద నెల్లూరు, పులికాట్‌ సరస్సు, ఉబ్లమడుగు జలపాతం, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, కొత్త కోడూరు బీచ్, మైపాడు బీచ్, రామతీర్థం, ఇస్కపల్లిని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. 75 శాతం అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో తొలి రెండేళ్లలో సిలబస్‌ ఒకటి కాదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement