ఆ వీడియో అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది

Amethi DM Removed For Misbehaving With PCS Officer In Amethi - Sakshi

అమేథి : జిల్లా కలెక్టర్‌గా ప్రజా సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తి తన బాధ్యతను విస్మరించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్‌ కుమార్‌ శర్మ అమేథి జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్‌ సింగ్‌ అలియాస్‌ సోనుసింగ్‌ అనే వ్యక్తి మంగళవారం రాత్రి గుర్తు తెలియని యువకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కాగా, సోనుసింగ్‌ మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదో తెలుసుకుందామని అతని బంధువు, ట్రైనీ పీసీఎస్‌ ఆఫీసర్‌ సునీల్‌ సింగ్‌ బుధవారం ప్రశాంత్‌కుమార్‌ను కలిసేందుకు వచ్చారు.

'సోనూసింగ్‌ మృతదేహానికి పోస్టుమార్టమ్‌ ఎందుకు నిర్వహించలేదని, తన కజిన్‌ను చంపిన వ్యక్తులను ఎందుకు పట్టుకులేదో చెప్పాలని' సునీల్‌ సింగ్‌ ప్రశ్నించారు. ఈ విషయం తన పరిధిలో లేదని, అయినా అది అడగానికి నువ్వెవరు అంటూ ప్రశాంత్‌ కుమార్‌ సునీల్‌ కాలర్‌ పట్టుకొని దౌర్జన్యంగా బయటికి ఈడ్చుకువచ్చాడు. అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ వీడియోను సునీల్‌ సింగ్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

అయితే ఈ వీడియోపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ..' ప్రశాంత్‌ కుమార్‌ ! నీవు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నావన్న విషయాన్ని మరిచిపోయావు. న్యాయం అడగడానికి వచ్చిన వ్యక్తి పట్ల నువ్వు ప్రదర్శించిన తీరు ఆగ్రహం తెప్పించింది. మనం ప్రజలకు సేవకులగా పని చేయాలే తప్ప నియంతలా వ్యవహరించకూడదంటూ' ట్వీట్‌ చేశారు. కాగా, ఉన్నతస్థాయి అధికారి పదవిలో ఉంటూ ప్రశాంత్‌ వ్యవహరించిన తీరును పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. 

మొరాదాబాద్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న అరుణ్‌కుమార్‌ను  ప్రశాంత్‌ కుమార్‌  స్థానంలో అమేథి జిల్లా మెజిస్ట్రేట్‌గా నియమించారు.  'మంగళవారం రాత్రి హత్యకు గురైన సోనూసింగ్‌ స్థానికంగా ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి శివనాయక్‌ సింగ్‌ స్థానిక బీజేపీ నేతగా ఉన్నారు. కాగా, మంగళవారం రాత్రి  కొంతమంది దుండగులు అతన్ని అడ్డగించి రూ. 2లక్షల రూపాయలు  ఇవ్వాలని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగి జిల్లా ఎస్పీ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో సోనూసింగ్‌ను హత్య చేసి పారిపోయారు. అయితే సోనూను హత్య చేసిన ఐదుగురిపై ఎప్‌ఐఆర్ నమోదు చేశామని' పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోనూ హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వచ్చిన సునీల్‌కుమార్‌పై జిల్లా మెజిస్ట్రేట్‌ ప్రశాంత్‌ కుమార్‌ దౌర్జన్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top