నిర్భయ దోషులందరూ తీహార్‌ జైల్లో

All The Nirbhaya Convicts In Tihar Jail - Sakshi

మండోలి నుంచి తీహార్‌కు పవన్‌ కుమార్‌ గుప్తా తరలింపు

జైల్లో డమ్మీ ఉరి ట్రయల్స్‌

మరో దోషి అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో నిర్భయపై మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులకి ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిహార్‌ బక్సర్‌ జైలు నుంచి ఉరితాళ్లను తీసుకువస్తున్నారు. ఉరికంబంపై శిక్ష అమలు ఎలా జరపాలో నలుగురు దోషుల బరువు, ఎత్తున్న దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్‌ వేసి చూశారని జైలు వర్గాలు తెలిపాయి. దోషులందరినీ ప్రస్తుతం తీహార్‌ జైలు నంబర్‌ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచి సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్‌ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

ఇటీవల మండోలి జైలులో ఉన్న పవన్‌ కుమార్‌ గుప్తాను తీహార్‌ జైలుకి తరలించినట్టు డైరెక్టర్‌ జనరల్‌ (జైళ్లు) సందీప్‌ గోయెల్‌ వెల్లడించారు. ముఖేష్‌ సింగ్, అక్షయ్‌ సింగ్, వినయ్‌ శర్మను ఉంచిన జైలు నెంబర్‌3లో పవన్‌ కుమార్‌ గుప్తాను ఉంచారు. నిర్భయను 2012 డిసెంబర్‌ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్‌ ఆస్పత్రిలో కన్నుమూసింది.

ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్‌ హోంకి పంపారు. మిగిలిన నలుగురిని ఏ రోజైతే అత్యంత పాశవికంగా నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారో అదే రోజు డిసెంబర్‌ 16న ఉరితీస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దోషులందరూ ఒకే జైలుకి చేరడంతో వారికి ఉరిశిక్ష అమలు జరపడం ఖాయమన్న వార్తలకు ఊతమిచ్చినట్టయింది.

ఢిల్లీ కాలుష్యం చంపేస్తోంది.మళ్లీ ఉరి ఎందుకు ? 
సుప్రీంలో అక్షయ్‌ సింగ్‌ రివ్యూ పిటిషన్‌
నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్‌ సింగ్‌ మరణ దండనని సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టుకెక్కినట్టు అతని తరఫు లాయర్‌ ఏపీ సింగ్‌ వెల్లడించారు. తన రివ్యూ పిటిషన్‌లో అక్షయ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఎలాగూ తమని చంపేస్తోందని, తమ ఆయుష్షుని తగ్గిస్తోందని మళ్లీ ఉరి శిక్ష ఎందుకంటూ ప్రశ్నించాడు.

2018, జూలై 9న అత్యున్నత న్యాయస్థానం మిగిలిన ముగ్గురు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ని కొట్టి వేసింది. అప్పుడు రివ్యూ పిటిషన్‌ వేయని అక్షయ్‌ ఉరి శిక్ష అమలుకు సన్నాహాలు జరుగుతున్న వేళ పిటిషన్‌ వేశాడు. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసే అవకాశాలే ఎక్కువున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top