ఎయిరిండియాకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం

Air India Asked to Pay Rs 47 Thousand for Serving Non Vegetarian Food - Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఎయిరిండియాకు రూ.47 వేలు జరిమానా విధించింది. శాఖాహారులైన ప్రయాణికులకు మాంసాహార భోజనం వడ్డించినందుకు గాను ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. వివరాలు.. మొహాలి సెక్టార్‌ 121కి చెందిన చంద్రమోహన్‌ పఠాక్‌ భార్యతో కలిసి ఢిల్లీ నుంచి చికాగో వెళ్లేందుకు జూన్‌ 17, 2016లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అంతేకాక అదే ఏడాది నవంబర్‌ 14న  తిరుగు ప్రయాణం నిమిత్తం రిటర్న్‌ టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నాడు. తాను, తన భార్య శాఖాహారులమని టికెట్లు బుక్‌ చేసుకునే సమయంలోనే స్పష్టం చేశాడు. చికాగో వెళ్లేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని తెలిపాడు చంద్రమోహన్‌. కానీ ఢిల్లీకి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విమాన సిబ్బంది తమకు మాంసాహారం భోజనం సర్వ్‌ చేశారని ఆరోపించారు. అంతేకాక ఆహార పొట్లాల మీద మాంసాహారం, శాఖాహారం అని తెలిపే గుర్తులు కూడా లేవన్నారు. దాంతో ఆగ్రహించిన చంద్రమోహన్‌ ఈ విషయం గురించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

ప్రయాణికుల మనోభావాలు దెబ్బతీసినందుకు గాను ఎయిరిండియా సంస్థ చంద్రమోహన్‌కు రూ. 10 వేలు జరిమానాతో పాటు లీగల్‌ ఖర్చుల నిమిత్తం మరో ఏడు వేల రూపాయలు అదనంగా చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఎయిరిండియా కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఎయిరిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కమిషన్‌ జరిమానా మొత్తాన్ని ఏకంగా నాలుగు రెట్లు పెంచి మొత్తం రూ. 47వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీని గురించి చంద్రమోహన్‌ పఠాక్‌ మాట్లాడుతూ.. ‘నేను ముందుగానే మేం శాఖాహారులమని స్పష్టంగా చెప్పాను. కానీ వారు నాకు మాంసాహార భోజనం అందించారు. వారు పాపం చేశారు. కోర్టు తగిన శిక్ష విధించింది’ అని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top