నేడు జనం ముందుకు జయలలిత | aiadmk mlas elect the lp leader on jayalalitha | Sakshi
Sakshi News home page

నేడు జనం ముందుకు జయలలిత

May 22 2015 2:57 AM | Updated on May 24 2018 12:08 PM

నేడు జనం ముందుకు జయలలిత - Sakshi

నేడు జనం ముందుకు జయలలిత

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం తొలిసారి జనం ముందుకు రానున్నారు.

ఎల్పీ నేతగా ఎన్నుకోనున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు!
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం తొలిసారి జనం ముందుకు రానున్నారు. ఆమె ఉదయం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. భేటీలో ఆమెను తిరిగి శాసనసభా పక్ష (ఎల్పీ) నేతగా ఎన్నుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశం తర్వాత ఆమె నగరంలోని అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్, ద్రవిడ నేత అన్నాదురై, హేతువాద నేత పెరియార్ రామస్వామి విగ్రహాలకు నివాళి అర్పిస్తారు.

‘అమ్మ’ దర్శనం కోసం పార్టీకార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఆస్తుల కేసులో బెయిల్‌పై గత ఏడాది అక్టోబర్‌లో బెంగళూరు నుంచి చెన్నై వచ్చాక జయ ఇంటికే పరిమితమయ్యారు. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెను ఇటీవల నిర్దోషిగా తేల్చడం తెలిసిందే. జయ సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనే దానిపై పార్టీ నేతలు పెదవి విప్పకున్నా ఈ నెల 22-24 మధ్య ఆమె ప్రమాణం చేసే అవకాశముందని భావిస్తున్నారు.

అడ్డుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్
జయ ఆస్తుల కేసు నుంచి బయటపడిన నేపథ్యంలో ఆమె తిరిగి తమిళనాడు సీఎంగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం జీఎస్ మణి అనే న్యాయవాది పిటిషన్ వేశారు. ఉన్నత కోర్టుల్లో నిర్దోషులుగా తేలిన వ్యక్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు సుప్రీం కోర్టులో పరిష్కారమయ్యేవరకు వారి పునర్నియామకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.

పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
జయ సీఎం కాకుండా అడ్డుకోవాలని కోరుతూ రవిరాజ్ గురురాజ్ కులకర్ణి అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు గురువారం కొట్టేసింది. ప్రచారం కోసమే దీన్ని వేశారంటూ కులకర్ణికి రూ. 25 వేల జరిమానా విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement