ఏడేళ్ల బాలికపై బంధువు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని సిహానిగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నంద్‌గ్రామ్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఘజియాబాద్: ఏడేళ్ల బాలికపై బంధువు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని సిహానిగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నంద్‌గ్రామ్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. గదిలోకి రావాలంటూ బాధితురాలిని ఆమె బాబాయ్ సుబోధ్ పిలిచాడు. గదిలోకి వెళ్లిన పాప ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో తమ పాప కోసం ఆమె తల్లిదండ్రులు అన్వేషించడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించకపోవడంతో చివరికి సుబోధ్ ఇంటికి వెళ్లారు. అయితే అతని గదికి తాళం వేసి ఉంది. శుక్రవారం రాత్రి వరకూ పాప ఇంటికి తిరిగి రాలేదు. మరుసటిరోజు ఉదయం పాప తల్లిదండ్రులు మరోసారి సుబోధ్ ఇంటికి వెళ్లారు.
ఎప్పటిమాదిరిగానే తాళం వేసి కనిపించింది. వారి మదిలో అనుమానపు బీజం మొలకెత్తింది. దీంతో వారు ఓ నకిలీ తాళం ఉపయోగించి సదరు గది తలుపులు తెరిచి చూడగా పాప మృతదేహం కనిపించింది. ఆమె గొంతుపై గాట్లు కనిపించాయి. దీనిని తీవ్ర మనోవేదనతోపాటు ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు పాప మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి ఆందోళన నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో వారు తమ ఆందోళనను విరమించారు. పాపపై అత్యాచారం జరిగినట్టు పోస్టుమార్టంతో తేలింది. వివిధ సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు రెండు బృందాలను నియమించామని సిహానిగేట్ పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి అశోక్ సిసోడియా మీడియాకు తెలియజేశారు.