రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఘజియాబాద్: దేశ అభివృద్ధిలో ఆరోగ్య రంగం విడదీయరాని భాగమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. నాణ్యమైన ఆరోగ్య సేవలు ఏ ఒక్క పౌరుడి కూడా దూరం కారాదని నొక్కి చెప్పారు. ఆదివారం ఆమె ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ప్రైవేట్ ఆస్పత్రి యశోద మెడిసిటీని ప్రారంభించారు. ‘ప్రభుత్వ ప్రాధామ్యాల్లో ప్రజలను వ్యాధుల బారిన పడకుండా రక్షణ కల్పించడం, ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడం కూడా ఉన్నాయి.
అందుకే, దేశవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో మౌలిక వనరుల కల్పన, వైద్య సేవల విస్తరణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ప్రయత్నాల ఫలితంగానే ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన భారత్ కల సాకారమవుతుంది’అని ముర్ము తెలిపారు. అభివృద్ధి దిశగా దేశం వేగంగా ముందుకు సాగాలంటే ప్రతి పౌరుడూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు.
నాణ్యమైన వైద్య సేవలను మారుమూల ప్రాంతాల్లోనూ అందించేందుకు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడికీ మెరుగైన వైద్యసేవలను అందించాలన్న లక్ష్యం నెరవేరాలంటే ప్రైవేటు సంస్థలు సైతం తమ అమూల్యమైన సేవల అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని రాష్ట్రపతి తెలిపారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వైద్య నిపుణులంతా దేశానికీ కూడా సేవలందిస్తున్నట్లేనన్నారు.
కేన్సర్ చికిత్సకు వాడే జీన్ థెరపీ వంటి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీ–బాంబే వంటి సంస్థలతో సంబంధాలను కలిగి ఉండాలని సూచించారు. ‘ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేశ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఎంతో సేవాభావంతో నిజాయతీగా పనిచేస్తున్న యశోద ఆస్పత్రి యాజమాన్యానికి ప్రశంసలు’అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. తల్లి పేరుతో యశోద మెడిసిటీ ఆస్పత్రిని నెలకొల్పిన చైర్మన్ డాక్టర్ అరోరాను రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రశంసించారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తదితరులు పాల్గొన్నారు.


