
వెలుగులోకి వస్తున్న హర్షవర్దన్ జైన్ బాగోతాలు
ఘజియాబాద్‌లో నకిలీ ఎంబసీని నిర్వహిస్తూ దొరికిపోయిన వైనం
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా వసూళ్లు రూ.300 కోట్ల
స్కామ్‌తోనూ సంబంధాలు అద్నాన్ ఖషోగ్గీ నుంచి జైన్ ఖాతాలోకి రూ.20 కోట్లు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో నకిలీ రాయబార కార్యాలయం(ఎంబసీ) ఏర్పాటు చేసిన కేసులో మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఎంబసీకి సూత్రధారి అయిన హర్షవర్దన్ జైన్(47) గత పదేళ్లలో 162 సార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు పోలీపులు గుర్తించారు. అంతేకాకుండా రూ.300 కోట్ల ఆర్థిక కుంభకోణంతో అతడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఈ స్కామ్‌పై ఉత్తరప్రదేశ్ ‘సిట్’దర్యాప్తు చేస్తోంది.
హర్షవర్దన్ జైన్ వెస్టార్కిటికా, సెబోర్గా, పౌల్వయా, లాడోనియా వంటి దేశాల పేరుతో ఎంబసీలు నిర్వహించాడు. ఇందుకు ఘజియాబాద్‌లోని తన రెండంతస్తుల బంగ్లాను అడ్డాగా మార్చుకున్నాడు. ఈ బంగ్లాపై విదేశీ జాతీయ జెండాలు ఎగురుతూ కనిపించేవని స్థానికులు చెప్పారు. ఖరీదైన కార్లలో తిరగడం జైన్‌కు అలవాటు. వాటిపై విదేశాల నామఫలకాలు, ముద్రలు ఉంటాయి.
తనను తాను వెస్టార్కిటికా దేశ రాయబారిగా స్థానికులకు పరిచయం చేసుకున్నాడు. రాయబారిగా నాటకం ఆడుతూ జనాన్ని నిండా ముంచేశాడు. మొత్తానికి జైన్ గుట్టు గతవారం రట్టయ్యింది. ఈ నెల 22న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఎంబసీ కార్యకలాపాలు బహిర్గతమయ్యాయి. ప్రపంచ దేశాల్లో తనకు పలుకబడి ఉందని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పటిస్తానంటూ జనం వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు జైన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విదేశాల్లో షెల్ కంపెనీలు
కేవలం మోసాలే కాదు, ఆర్థిక నేరాల్లోనూ జైన్ ఆరితేరినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ పథకాలు, షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంక్ ఖాతాలతో భారీ సొమ్ము కొల్లగొట్టినట్లు పేర్కొంటున్నారు. జైన్ 2005 నుంచి 2015 వరకు 19 దేశాల్లో పర్యటించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి 54 సార్లు వెళ్లొచ్చాడు. యూకేకు 22 సార్లు వెళ్లాడు. అంతేకాకుండా మారిషస్, ఫ్రాన్స్, కామెరూన్ తదితర దేశాల్లో పర్యటించాడు.
విదేశాల్లో జైన్‌కు సంబంధించిన 25 షెల్ కంపెనీల లింక్‌లను స్పెషల్ టాస్‌్కఫోర్స్ వెలికితీసింది. స్టేట్ ట్రేడింట్ కార్పొరేషన్, ఈస్ట్ ఇండియా కంపెనీ యూకే లిమిటెడ్, ఐలాండ్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ, ఇందిరా ఓవర్సీస్ లిమిటెడ్ తదితర పేర్లతో ఇవి ఏర్పాటయ్యాయి. అలాగే జైన్ పేరిట విదేశాల్లో 10 బ్యాంకు ఖాతాలున్నాయి. ఆరు దుబాయిలో, మూడు యూకేలో, ఒకటి మారిషస్‌తో తెరిచాడు. 12 నకిలీ డిప్లొమాటిక్ పాస్‌పోర్టులను అతడి నివాసంలో పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ రాకెట్
హర్షవర్దన్ జైన్ నెట్‌వర్క్ కేవలం ఇండియాకే పరిమితం కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో జని్మంచిన టర్కీ జాతీయుడు అహసన్ అలీ సయీద్ కూడా జైన్‌కు సహకరించాడు. ఇతడి సాయంతో జైన్ విదేశాల్లో పలు కంపెనీలను రిజిస్టర్ చేయించాడు. రూ.300 కోట్ల కుంభకోణంలో అహసన్ అలీ సయీద్ ప్రధాన నిందితుడు. ఇతడు జైన్‌తో కలిసి స్విట్లర్జాండ్‌లోని కంపెనీలను టార్గెట్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలను ఎంచుకున్నాడు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో సొమ్ము గుంజాడు.
జైన్, అలీ సయీద్ కలిసి హవాలా మార్గాలు, షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంకు ఖాతాలతో ఈ డబ్బును సొంతం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియాకు చెందిన వివాదాస్పద ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గీతోనూ జైన్‌కు సంబంధాలున్నాయి. 2002, 2004లో ఖషోగ్గీ రూ.20 కోట్లను జైన్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులు జైన్ దేనికోసం ఖర్చు చేశాడన్న దానిపై ఎస్టీఎఫ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగనుంది. జైన్‌ను పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తే మరికొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.