‘కేన్సర్‌.. మనీ వేస్ట్‌’ : రియల్టర్‌ ఎంత పనిచేశాడు! | Dont Want Money Wasted UP Realtor With Cancer Shoots Dead Wife Self | Sakshi
Sakshi News home page

‘కేన్సర్‌.. మనీ వేస్ట్‌’ : రియల్టర్‌ ఎంత పనిచేశాడు!

Apr 17 2025 10:09 AM | Updated on Apr 17 2025 10:11 AM

Dont Want Money Wasted UP Realtor With Cancer Shoots Dead Wife Self

 లైఫ్‌కు గ్యారంటీలేదు..పైగామనీ వేస్ట్‌.. అందుకే..!

కేన్సర్‌  మహమ్మారి సోకిందంటే మరణ శాసనమే అని చాలా మంది భావిస్తారు. కానీ  ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత కేన్సర్‌ను జయించవచ్చు. మెరుగైన  వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు, ఆత్మ విశ్వాసం, మనోధైర్యం ఉంటే ఈ వ్యాధినుంచి బైటపడవచ్చు. మరీ ముఖ్యంగా కేన్సర్‌ వ్యాధి నివారణలో  ముందస్తు గుర్తింపు, అవగాహన చాలా అవసరం.  ఈ అవగాహన లేమి కారణంగా పచ్చని కాపురం  కుప్పకూలి పోయింది. వివరాలు ఇలా ఉ‍న్నాయ్‌.

ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి  కుల్‌దీప్ త్యాగి (46)  తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకంటే తనకు కేన్సర్‌ వ్యాధి సోకిందని, ఎంత డబ్బు ఖర్చు చేసినా అది నయం కాదని భయపడిపోయాడు. అందుకే ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుల్‌దీప్ తన భార్యను లైసెన్స్ పొందిన రివాల్వర్‌తో కాల్చి చంపి, ఆపై నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని  ఇంట్లో తనను తాను కాల్చుకున్నాడు. సంఘటన జరిగిన సమయంలో వారి కుమారులు ఇంట్లో ఉన్నారు. తుపాకీ కాల్పులు విన్న వెంటనే వారి తల్లిదండ్రుల గదికి చేరుకున్నారు. కుల్‌దీప్ మృతదేహం నేలపై, అన్షు మృతదేహం మంచంపై కనిపించింది.  వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు  ప్రకటించారు. పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను శవపరీక్షకు పంపారు.

‘‘కేన్సర్ ఉందని నిర్ధారణ అయింది.  నా కుటుంబానికి దాని గురించి తెలియదు. కోలుకుంటానన్న గ్యారంటీ లేదు. దీనికి చికిత్స కోసం డబ్బు వృధా .. అందుకే ఈ నిర్ణయం. ఇందులో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు, ముఖ్యంగా నా పిల్లలు నిందించాల్సిన అవసరం లేదు"  అంటూ సూసైడ్ నోట్ రాశాడు. అలాగే  కలిసి ఉంటామని ప్రమాణం చేశాను కాబట్టి తన భార్య అన్షు త్యాగిని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోతున్నా అంటూ ఆమెను కూడా కాల్చి చంపేశాడు.  ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుల్‌దీప్ తండ్రి రిటైర్డ్ పోలీసు. ఈ విషయంపై  దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి పూనమ్ మిశ్రా వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement