న్యూఢిల్లీ: అయిదేళ్ల అనంతరం భారత్, చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు అధికారికంగా మొదలయ్యాయి. ఈ విషయాన్ని భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ఆదివారం ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. మొదటి విమానం కోల్‌కతా నుంచి గ్వాంగ్‌ఝౌకు టేకాఫ్ తీసుకుందన్నారు. నవంబర్ 11వ తేదీ నుంచి తాము కోల్‌కతా–గ్వాంగ్‌ఝౌ ఎయిర్ బస్ సర్వీసును ప్రతిరోజూ నడుపుతామని ఇండిగో ప్రకటించింది.
అదేవిధంగా, నవంబర్ 9వ తేదీ నుంచి షాంఘై–న్యూఢిల్లీ మార్గంలో వారానికి మూడు సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. 2020 జూన్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య తూర్పులద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న తీవ్ర ఘర్షణలు, కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యాల మోహరింపులతో 2024 అక్టోబర్ వరకు తీవ్ర ఉద్రికతలు కొనసాగాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. డైరెక్ట్ విమానాల రాకపోకలతో తిరిగి ఈ సంబంధాలు తిరిగి గాడినపడతాయని భావిస్తున్నారు.


