పీఎంకేఎస్‌వైలో 11 తెలంగాణ ప్రాజెక్టులు | 11 Telangana projects in PMKSY | Sakshi
Sakshi News home page

పీఎంకేఎస్‌వైలో 11 తెలంగాణ ప్రాజెక్టులు

Apr 13 2016 3:38 AM | Updated on Sep 3 2017 9:47 PM

పీఎంకేఎస్‌వైలో 11 తెలంగాణ ప్రాజెక్టులు

పీఎంకేఎస్‌వైలో 11 తెలంగాణ ప్రాజెక్టులు

ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులను చేర్చేందుకు కేంద్ర జలవనరులశాఖ సబ్ కమిటీ అంగీకరించిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు.

♦ ఇందుకు కేంద్ర సబ్ కమిటీ అంగీకరించింది
♦ రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు వెల్లడి
 
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులను చేర్చేందుకు కేంద్ర జలవనరులశాఖ సబ్ కమిటీ అంగీకరించిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన పీఎంకేఎస్‌వై కార్యాచరణ రూపకల్పన తుది సమావేశంలో హరీశ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొమరం భీం, గొల్లవాగు, రల్లివాగు, మత్తడివాగు, పెద్దవాగు (నీల్‌వాయి ప్రాజెక్టు), పెద్ద వాగు (జగన్నాథ్ ప్రాజెక్టు), పాలెం వాగు, ఎస్సారెస్పీ రెండో దశ, రాజీవ్ భీమా ఎత్తిపోతల, దేవాదుల ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వైలో మొదటి ప్రాధాన్యత కింద, ఇందిరమ్మ వరద నీటి కాలువను రెండో ప్రాధాన్యత కింద చేర్చడానికి జలవనరులశాఖ సబ్ కమిటీ అంగీకరించిందని వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏఐబీపీ ద్వారా రూ. 1,155 కోట్లు, నాబార్డు ద్వారా రూ. 2,825 కోట్లను రుణం రూపంలో ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

 మే 15 నాటికి మొదటి విడత నిధులు
 రాష్ట్రాలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు వీలుగా మొదటి విడత నిధులను మే 15 నాటికి విడుదల చేయాలని కేంద్ర సబ్ కమిటీ సిఫారసు చేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రాజెక్టులను పూర్తిచేయడానికి రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులతో సంబంధం లేకుండా నాబార్డు నుంచి రుణం పొందే అవకాశం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి సంబంధించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో 40 శాతం నిధులనే సామగ్రి కోసం ఖర్చు చేసేందుకు ఇప్పటివరకు వీలుందని, దాన్ని 60 శాతానికి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. కేంద్ర జలవనరుల కమిషన్ ప్రాంతీయ కార్యాలయాలను బలోపేతం చేయడం ద్వారా త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు పొందే వీలుంటుందని సమావేశంలో చర్చించామన్నారు.

 లాతూరు పరిస్థితి రాకూడదనే...
 మహారాష్ట్రలోని లాతూరులో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు తెలంగాణలో రాకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ను రూపొందించారని హరీశ్‌రావు వివరించారు. ఈ పథకంలో భాగంగా 245 టీఎంసీల నీటిని చెరువుల్లో నిలుపుకొనే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ‘మిషన్ కాకతీయ’కు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని హైదరాబాద్ వచ్చిన నీతి ఆయోగ్ బృందాన్ని కోరామని, ఇందుకు నీతి ఆయోగ్ బృందం సానుకూలంగా స్పందించిందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావుతోపాటు రాష్ట్ర ఆయకట్టు ప్రాంత అభివృద్ధి సంస్థ డెరైక్టర్ డాక్టర్ మల్సూర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement