పది కోట్ల మందికి కరోనా ముప్పు!

10 Crore Indians Are At Risk Of Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో దాదాపు 60 కోట్ల మంది తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. నీటి కొరత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయం తెల్సిందే. నీటి కొరత, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రజలు ఎక్కువగా ఇతర వైరస్‌లతోపాటు కరోనా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంది. జూన్‌ 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 46 శాతం కేసులు ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లలోనే నమోదయ్యాయి. 

తాగేందుకు రక్షిత మంచినీరుతోపాటు, ఇతర నీరు అందుబాటులో లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు, చేతులు సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్ల వాడకం అందుబాటులో లేకపోవడం వల్లనే ఆయా రాష్ట్రాల్లో వైరస్‌ మహమ్మారీ ఎక్కువగా విజృంభించిందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రాంతాలు కూడా ఉన్నాయి, సామూహిక నీటి సేకరణ, సామూహిక మరుగుదొడ్లు ఉపయోగించే ప్రాంతాల్లో కరోనా లాంటి మహమ్మారిని అరికట్టడం కనాకష్టం. అలాంటి ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించడం కూడా కష్టమే. 

‘నేషనల్‌ శాంపిల్‌ సర్వే’ ప్రకారం దేశంలో దేశ గ్రామీణ ప్రాంతాల్లో 48.60 శాతం మందికి మంచినీటి సౌదుపాయం అందుబాటులో లేదు. 30 శాతం మంది మంచినీటి కోసం ప్రభుత్వ నీటి వనరులపై మూకుమ్మడిగా ఆధారపడి బతుకుతున్నారు. ‘కమ్యూనిటీ మంచినీటి వనరులు, కమ్యూనిటి మరగుదొడ్లపై ప్రజలు ఎక్కువగా ఆధారపడడం వల్లనే కరోనా లాంటి వైరస్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి’ అని ‘వాటర్‌ ఏడ్‌ ఇండియా’ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వీకే మాధవన్‌ తెలిపారు. దేశంలో ఎంత మంది మంచీనిటికి, మరుగుదొడ్లకు కమ్యూనిటీపై ఆధారపడి బతుకుతున్నారో, వారిలో ఎంత మంది వైరస్‌ బారిన పడే అవకాశం ఉందో అన్న అంశాలను విశ్లేషించి దేశంలో దాదాపు పదికోట్ల మంది ప్రజలు అలా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top