సోనమ్‌–కంగనాల మాటల తూటాలు

Who gives her a right to judge me - Sakshi

మనసుకి అనిపించినది ఎవరికీ భయపడకుండా బాహాటంగా మాట్లాడే స్వభావం ఉన్న నటి కంగనా రనౌత్‌. ఇటీవల తన సూపర్‌ హిట్‌ చిత్రం ‘క్వీన్‌’ దర్శకుడు వికాస్‌ బాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే వాటిని సమర్థిస్తూ ‘అవును’ అంటూ ఆ ఆరోపణలు చేసిన స్త్రీని  సపోర్ట్‌ చేశారు కంగనా. ఈ నేపథ్యంలో సోనమ్‌ కపూర్‌ ముందు బాలీవుడ్‌ మీడియా కంగనా గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. సోనమ్‌ తనదైన స్టైల్‌లో ఘాటుగా స్పందించారు. ఆ మాటలకు కంగనా ప్రతిస్పందించారు. ఇద్దరి మాటలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

కంగనాని నమ్మలేం
వికాస్‌  బాల్‌పై ఆరోపణలు చేసిన స్త్రీని కంగనా సపోర్ట్‌ చేయడం పై మీ అభిప్రాయం ఏంటి? అని సోనమ్‌ కపూర్‌ని అడగ్గా – ‘‘స్త్రీలపై వేధింపులు దారుణం. చాలా బాధగా అనిపిస్తుంది. అయితే కంగనా మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తనని నమ్మడం కష్టం. కంగనా చాలా మాటలు మాట్లాడుతుంది. వాటిలో నిజం ఎంత? అనేది చెప్పలేం’’ అని సమాధానమిచ్చారు.
– సోనమ్‌

సోనమ్‌ గొప్ప నటి కాదు
‘‘కంగనాని నమ్మలేం అంటే అర్థం ఏంటి? నాకు ఇలాంటి సంఘటన జరిగింది అని నేను చెప్పుకున్నప్పుడు నన్ను జడ్జ్‌ చేసే హక్కు సోనమ్‌కి ఎవరు ఇచ్చారు? కొందరిని నమ్మాలి.. మరికొందర్ని నమ్మకూడదు అనే లైసెన్స్‌ ఏమైనా తనకుందా? నా మాటలను నమ్మకపోవడానికి  కారణమేంటో? మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తా అనే పేరు నాకుంది. మన దేశాన్ని గురించి పలు ప్రపంచ దేశాల సదస్సులలో ప్రసంగించాను. నా ప్రసంగాల ద్వారా యువతను ప్రభావితం చేయగలను అనే పేరు నాకుంది.

అంతే కానీ మా నాన్నగారి వల్ల కానీ, ఆయన సంపాదించి పెట్టిన ప్లేస్‌ వల్ల కానీ కాదు. నాకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఉంది. అది స్వయంగా నేను సంపాదించుకున్నదే. సోనమ్‌ గొప్ప నటీ కాదు.. వక్త కూడా కాదు. నా గురించి మాట్లాడటానికి వాళ్లకు ఏం హక్కుందని?’’ అన్నారు. మొత్తానికి సోనమ్‌–కంగనాల వాడి వేడి మాటలు చాలామందికి వినోదం అయ్యాయి. నెక్ట్స్‌ వీళ్ల నుంచి వచ్చే తూటాల్లాంటి మాటల కోసం ఎదురు చూస్తున్నారు.
– కంగనా
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top