రాహుల్‌ గాంధీ బయోపిక్‌పై స్పందించిన వివేక్‌ ఒబేరాయ్‌

Vivek Oberoi Comments Over Rahul Gandhi Biopic - Sakshi

రాహుల్‌ గాంధీ ఏం సాధించాడని ఆయన గురించి బయోపిక్‌ తీయాలి అంటూ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ ప్రశ్నించారు. ప్రస్తుతం వివేక్‌ నరేంద్రమోదీ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడే విడుదల చేయకూడదంటూ ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దాంతో ఈసీ ఈ చిత్రాన్ని ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఓ ఇంగ్లీష్‌ చానెల్‌తో మాట్లాడారు వివేక్‌ ఒబేరాయ్‌. ఈ సందర్భంగా విలేకరి ‘రాహుల్‌ గాంధీ బయోపిక్‌లో నటిస్తారా’ అని వివేక్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన ‘రాహుల్‌ గాంధీ ఏం సాధించాడని ఆయన గురించి బయోపిక్‌ తీయాలి.. ఒకవేళ అలా తీయాల్సి వచ్చినా షూటింగ్‌ మొత్తం థాయ్‌లాండ్‌లోనే జరుగుతుంద’ని ఎద్దేవా చేశారు.

‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఓ యువకుడు టీ అమ్మి చదువుకుంటూ దేశంలో అత్యున్నత స్థానాన్ని పొందారు. ప్రపంచం అంతా చూసే శక్తిగా ఎదిగారు. అమెరికా అధ్యక్షుడైనా.. జపాన్‌ ప్రధాని ఐనా వారి కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం కేవలం మోదీకి మాత్రమే ఉంది. అలాంటి గొప్ప వ్యక్తికి సంబంధించిన కథతో ఈ చిత్రాన్ని తెరకిక్కించాము. దీనిలో ఏ పార్టీకి ప్రతికూలంగా కానీ.. అనుకూలంగా కానీ మాట్లాడలేదు. కానీ సినిమా విడుదల చేస్తామంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి’ అని పేర్కొన్నారు.

‘అంతేకాక రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్లో భావప్రకటనా స్వేచ్ఛ కూడా ఉంది. ఎలాంటి అంశాల గురించి సినిమా తీయాలి.. ఎప్పుడు రిలీజ్‌ చేయాలనే విషయం గురించి ఎవరూ నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రంజాన్‌, క్రిస్టమస్‌ పండుగ సందర్భంగా సినిమాలు రిలీజ్‌ చేస్తే అప్పుడే ఎందుకు రిలీజ్‌ చేస్తున్నారని ఎవరైనా వారిని ప్రశ్నిస్తున్నారా’ అని మండిపడ్డారు. దర్శకుడు ఒమంగ్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధానపాత్రలో నటిస్తుండగా.. బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషీ, కిశోర్‌ షహానే, దర్శన్‌ కుమార్‌ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top