ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

Vijay Devarakonda Inspirational Speech At Dear Comrade Music fest - Sakshi

‘‘మ్యూజికల్‌ ఫెస్టివల్‌’ అని కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు.. వేరే హీరోలు చేయనివి చేస్తున్నారు? అని మేం ‘డియర్‌ కామ్రేడ్‌’ మ్యూజిక్‌ ఫెస్ట్‌ చేసిప్పుడు కొందరు అడిగారు. వేరే యాక్టర్లు చేయనిది చేద్దామనో, ఇండస్ట్రీలో లేనిది చేద్దామనో కాదు. నా సినిమాకి నాకు నచ్చినట్టు చేద్దామని ‘మ్యూజిక్‌ ఫెస్ట్‌’ నిర్వహించాం’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్‌ చెరుకూరి (సి.వి.ఎం), యష్‌ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ చెప్పిన విశేషాలు.

► ఈ సినిమా కోసం జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరపరచిన పాటలు నాకు బాగా నచ్చాయి. ఓ సినిమాలో రెండు హిట్‌ పాటలొస్తే చాలా సంతోషం. ఇందులో 8 పాటలుంటే 5 పాటలు సూపర్‌గా ఉన్నాయి. పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రమోషన్‌ కోసం నాలుగు సిటీలు తిరగాలి. ప్రతిసారీ ఏం మాట్లాడతాం.. ఆడుతూ పాడుతూ ఎంజాయ్‌ చేద్దామనుకుని మ్యూజిక్‌ ఫెస్ట్‌ ప్లాన్‌ చేశాం. కర్నాటక, కేరళ ప్రేక్షకులు నా సినిమాలు చూస్తున్నారు.

వారి మధ్య ‘మ్యూజిక్‌ ఫెస్టివల్‌’ చేద్దామనుకున్నాం. ఫస్ట్‌ బెంగళూరులో చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం టెన్షన్‌ ఉండేది. అక్కడ సూపర్‌ సక్సెస్‌ అయింది. చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌లోనూ సక్సెస్‌ అయింది. ఇది నాకొక తీపి గుర్తు. డ్యాన్స్‌లు చూడటం ఇష్టం. కానీ, చేయడమంటే భయం. సాంగ్‌ షూట్‌ ఉందంటే.. ఓ భయం. రెండు రోజులు రిహార్సల్‌ చేస్తే కానీ షూటింగ్‌ జరగదు. డ్యాన్స్‌ నాకు సహజంగా రాదు. కానీ, ఎంజాయ్‌ చేస్తాను.

► ‘డియర్‌ కామ్రేడ్‌’ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకి మంచి డైరెక్టర్, సంగీతం, కెమెరా, డైలాగ్స్, నటన... ఇలా ప్రతిదీ బాగా కుదిరింది. చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా. ‘అర్జున్‌ రెడ్డి’ టైమ్‌లో ఈ కథ విన్నా. అప్పటి నుంచి ఈ ప్రయాణం సాగుతోంది. భావోద్వేగంతో కూడుకున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. థియేటర్‌ నుంచి ప్రేక్షకులు వెళ్లేటప్పుడు ఒక ఎమోషన్‌ని, ఆలోచనని ఇంటికి తీసుకెళ్తారు. చూసి, ఎంజాయ్‌ చేసి థియేటర్లో వదిలేసే సినిమా కాదు. బాబీ, లిల్లీ పాత్రల ప్రయాణం ఇది. బాబీపై లిల్లీ ప్రభావం ఏంటి? లిల్లీపై బాబీ ప్రభావం ఏంటి? అన్నది ముఖ్యం.

► తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ఇది. ‘బాహుబలి’ తెలుగు, తమిళ్, మలయాళంలో విడుదలైంది కానీ కన్నడలో రిలీజ్‌ కాలేదు. కానీ, ‘బాహుబలి’తో మా సినిమాకి పోలికే లేదు. ఎందుకంటే ఆ కథే వేరు. ‘డియర్‌ కామ్రేడ్‌’ని తెలుగులోనే తీద్దామని స్టార్ట్‌ చేశాం. 50శాతం షూటింగ్‌ అయ్యాక ఈ కథ అందరికీ నచ్చుతుందనిపించి నాలుగు భాషల్లో చేశాం.

► తెలుగు సినిమా ‘అర్జున్‌రెడ్డి’ 250 కోట్లు వసూలు చేసిందంటే మన వద్ద ఏదో మ్యాజిక్‌ ఫార్ములా ఉందని బాలీవుడ్‌ వాళ్లు షాక్‌ అయ్యారు. నాకు బాగా ఎగై్జటింగ్‌గా అనిపిస్తే బాలీవుడ్‌ సినిమా చేస్తా. తెలుగు ఇండస్ట్రీలో ఉండి నేషనల్‌ వైడ్‌ షేక్‌ చేస్తేనే మజా ఉంటుంది. ‘బాహుబలి, ‘అర్జున్‌రెడ్డి, కేజీఎఫ్‌’తో షేక్‌ చేశారు. ఇప్పుడు ‘సాహో’తో షేక్‌ చేస్తున్నారు. మణిరత్నం, శంకర్‌గార్లు కూడా షేక్‌ చేశారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ బాలీవుడ్‌ రీమేక్‌ హక్కులు అడుగుతున్నారు. తర్వాత ఎలాగూ నన్నే చేయమంటారు కాబట్టి నా వల్ల కాదని చెప్పా. చెప్పిన కథనే మళ్లీ ఏం చెబుతాం? హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పూర ్తయ్యేటప్పటికి ‘నోటా, టాక్సీవాలా, గీత గోవిందం, కామ్రేడ్‌’..నాలుగు కథలు చెప్పా. ఈ జర్నీలో వేరే భాషల్లో సినిమాని ఎలా ప్రమోట్‌ చేయాలో తెలిసింది.

► నేను నటుణ్ణి. ప్రతి సీన్‌ రియల్‌గా ఉండేలా చేయాలి. రష్మిక నాకు రెండేళ్లుగా తెలుసు. సినిమాలో బాబీ, లిల్లీలకు చిన్నçప్పుడే పరిచయం అవుతుంది. సినిమాలో వాళ్ల ప్రయాణం కనిపించాలి. రష్మిక స్థానంలో వేరే ఎవరు ఉన్నా చేసేవాడిని.  ఓ నటుడిగా నాకు ఓ కుర్చీ ఇచ్చినా కెమిస్ట్రీ తీసుకొస్తా. ఫైట్‌ సీన్స్‌ తీస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్‌ ఉంటుందో.. ముద్దు సీన్లు తీస్తున్నప్పుడు కూడా అలాంటి అనుభూతే ఉంటుంది.. అంతేకానీ, ఇంటర్నల్‌గా ఎలాంటి ఫీల్‌ ఉండదు. నాకు తెలిసి ఏడాది తర్వాత సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సాధారణం అయిపోతాయనుకుంటున్నా. ముద్దు సన్నివేశాలు పెడితే సినిమాలు నడుస్తాయనడం కరెక్ట్‌ కాదు. రియల్‌ లైఫ్‌లో ఉండే ఎమోషన్స్‌ రీల్‌ లైఫ్‌లో ఉండవు. కానీ, ఓ నటుడిగా వృత్తికి న్యాయం చేయడం నా బాధ్యత.

► ప్రతి అబ్బాయి బాబీ కాదేమో కానీ, ప్రతి అమ్మాయి లిల్లీ. నాకు తెలిసిన పదిమందిలో తొమ్మిది మంది అమ్మాయిల జీవితం ఈ సినిమా. ఇలాంటి కథ చెప్పాలనిపించింది. దాన్ని చక్కగా చెబుతాడనే నమ్మకం భరత్‌పై ఉంది.. చెప్పాడు.  

► పూరి జగన్నాథ్‌గారితో సినిమా అని వస్తున్న వార్తలు నిజం కాదు. కొరటాల శివగారు చిరంజీవి సార్‌ సినిమా పూర్తి చెయ్యాలి. అది పూర్తయ్యేసరికి నేను ఏ  సినిమాలు చేస్తుంటానో, ఆయన ఏ సినిమా చేస్తుంటారో తెలియదు. కానీ, ఆయనంటే నాకు ఇష్టం. ఆయనతో పని చేయాలనుంది.  

► గెడ్డం పెంచి, బైక్‌లపై తిరిగేవాళ్లంతా విజయ్‌ దేవరకొండ కాలేరు. దాని వెనకాల కొన్నివేల ఆలోచనలు పనిచేస్తుంటాయి. అలా అవ్వాలనుకునేవాళ్లకి ఆల్‌ ది బెస్ట్‌. ప్రతిభ, ప్యాషన్, ఇంటెలిజెంట్‌ అనేవి ఉంటేనే ఇక్కడ ఎవరైనా స్టార్‌ అవ్వొచ్చు. ఇక్కడ ఎవరి స్థానం వారిది. ఇమేజ్‌ అన్నది శాశ్వతం కాదు. నేను ‘అర్జున్‌రెడ్డి’ కి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను.

► క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో సినిమా తర్వాత విజయ్‌ అనే కొత్త దర్శకుడితో సినిమా ఉంటుంది. మైత్రీ మూవీస్‌లోనే ఈ సినిమా ఉంటుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top