ఈసారి వర్మ ఐడియా... వీరప్పన్ జీవితం | Verma idea of Veerappan's life movie | Sakshi
Sakshi News home page

ఈసారి వర్మ ఐడియా... వీరప్పన్ జీవితం

Apr 11 2015 1:19 AM | Updated on Oct 22 2018 1:59 PM

ఈసారి వర్మ ఐడియా...  వీరప్పన్ జీవితం - Sakshi

ఈసారి వర్మ ఐడియా... వీరప్పన్ జీవితం

పారే నది లాగా రోజుకో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శుక్రవారం మరో కొత్త ప్రాజెక్ట్ వివరం బయటపెట్టారు.

పారే నది లాగా రోజుకో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శుక్రవారం మరో కొత్త ప్రాజెక్ట్ వివరం బయటపెట్టారు. నిన్న గాక మొన్ననే సెలైంట్ సినిమా తీయనున్నట్లు పేర్కొన్న వర్మ ఇప్పుడు ఒక నిజజీవిత కథను ఎంచుకున్నారు. పేరుమోసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను హతమార్చిన వ్యక్తి జీవితంపై సినిమాకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి అనుకుంటున్న పేరు - ‘కిల్లింగ్ వీరప్పన్’. విశేషం ఏమిటంటే, ప్రముఖ కన్నడ హీరో శివరాజ్ కుమార్ (కన్నడ సూపర్‌స్టార్ స్వర్గీయ రాజ్‌కుమార్ కుమారుడు) అందులో వీరప్పన్‌ను కడతేర్చిన వ్యక్తిగా కనిపించనున్నారు.

వీరప్పన్ మీద కాక, వీరప్పన్‌ను చంపిన వ్యక్తి మీద సినిమా ఏమిటని అనుకొనేవారికి, వర్మ తనదైన వివరణ కూడా ఇచ్చారు. ‘‘వీరప్పన్ మీద సినిమా తీయాలని ఎన్నో ఏళ్ళుగా నా కోరిక. ఎట్టకేలకు నాకు సరైన స్క్రిప్టు లభించింది. ప్రపంచంలోనే అరుదైన నేర చరిత్ర అతనిది. అమెరికా, చైనాలలో కూడా అతనికి దీటైన నేరస్థుడు మరొకరు లేరు. వీరప్పన్ వాస్తవ కథ కోసం అత్యంత రహస్యవర్గాల నుంచి సమాచారం సేకరించా. నేరసామ్రాజ్య నేత దావూద్ ఇబ్రహీమ్ కన్నా వంద రెట్ల నాటకీయ వీరప్పన్ జీవితంలో ఉంది. మూడు రాష్ర్టప్రభుత్వాలు అతణ్ణి పట్టుకోవడానికి 15 ఏళ్ళ కాలంలో దాదాపు 600 కోట్ల పైగా ఖర్చు చేశాయి. అలాంటి వ్యక్తిని ఒకే ఒక్కడు హతమార్చాడు. ఆ వ్యక్తి మీద ఈ సినిమా ఉంటుంది’’ అని వర్మ పేర్కొన్నారు.

వీరప్పన్ కథతో పోలిస్తే తాను ఇప్పటిదాకా తీసిన నేరసామ్రాజ్య చిత్రాలన్నీ చిన్నపిల్లలాట లాంటివని ఆయన అన్నారు. చిత్రం ఏమిటంటే, వీరప్పన్ అప్పట్లో కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి, ఆనక వదిలిపెట్టారు. తీరా ఇప్పుడు స్వర్గీయ రాజ్‌కుమార్ కుమారుడైన శివ్‌రాజ్ కుమారే వెండితెరపై వీరప్పన్‌ను కడతేర్చిన వ్యక్తిగా నటించడం విశేషం. ‘‘రియల్ లైఫ్‌లో కుమారుడైన ఒక వ్యక్తి, రియల్ లైఫ్ విలన్‌పై రీల్ లైఫ్‌లో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఓ ఉదాహరణ’’ అని వర్మ వ్యాఖ్యానించారు. ప్రతి పనికీ తనదైన లాజిక్ వర్మ సొంతం కదూ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement