
నాన్న బాట.. విజయాల తోట
అడుగు తడబడితే సరిచేస్తాడు. అన్ని వేళలా వేలుపట్టి నడిపిస్తాడు. ఓడిపోతే ఓదార్పు అవుతాడు.
అడుగు తడబడితే సరిచేస్తాడు. అన్ని వేళలా వేలుపట్టి నడిపిస్తాడు. ఓడిపోతే ఓదార్పు అవుతాడు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు. మన గెలుపు కోసం పరితపిస్తాడు. ఎంత ఎదిగినా నాన్న నేర్పిన పాఠాలు జీవితంలో నిత్యస్మరణమే. ‘నాన్న బాట.. మా విజయ సూత్రం’ అంటూ... తండ్రి సుగుణాలు తమనెలా ప్రభావితం చేశాయో? జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాయో? చెబుతున్నారు విభిన్న రంగాల ప్రముఖులు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ వీకెండ్ ప్రత్యేకం. – సాక్షి, సిటీబ్యూరో
నాన్నే.. నా హీరో
మా నాన్నే.. నా హీరో. నా ఫస్ట్ ఫ్రెండ్.. నా ఫస్ట్ లవ్.. అన్నీ ఆయనే. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. కూతురు సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నారు. నా వెన్నంటే ఉండి నడిపించారు. నాన్న లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. నా లైఫ్‌లోనే కాదు.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ తల్లిదండ్రులకు ప్రత్యేక స్థానం ఉండాలి.
– కాజల్
ఆయనే స్ఫూర్తి...
మా నాన్న నటనా ప్రస్థానాన్ని చూస్తే.. నాలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంది. నా రియల్ లైఫ్, రీల్ లైఫ్‌కు ఆయనే స్ఫూర్తి. నాన్న నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయన అంకితభావం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారు ఆయనను చూసి ఎంతో నేర్చుకుంటారు.
– శ్రుతిహాసన్
నాన్న నేర్పిన క్రమశిక్షణ..
నాన్న ఆర్మీ ఆఫీసర్. చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణతో పెంచారు. నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే ఆయన నేర్పిన క్రమశిక్షణే కారణం. ఇప్పటికీ నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫైనాన్షియల్ విషయంలో నేను జీరో. నా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఆయనే హ్యాండిల్ చేస్తారు.
– రకుల్ ప్రీత్‌సింగ్
మై లైఫ్.. మై డాడ్
నాన్న నాకు మంచి స్నేహితుడు. ఏ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినా ముందుగా నాన్నతోనే షేర్ చేసుకుంటాను. మా ఇద్దరి మధ్య ఫన్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. నా లైఫ్‌లో అన్నీ నాన్నే. నేను కొంచెం మూడీగా ఉన్నా.. నన్ను సంతోష పెట్టేందుకు ఏదో ఒకటి చేస్తారు.
– నిహారిక
నాన్న సపోర్ట్‌తోనే ఈ స్థాయికి...
నేను ఈ స్థాయికి ఎదగడంలో నాన్న సపోర్ట్ ఎంతో ఉంది. నేను టీనేజ్‌లోనే హీరోయిన్ అయ్యాను. అప్పుడు ఏది మంచి.. ఏది చెడు అనేది నాన్న అర్థమయ్యేలా చెప్పేవారు. వీలైతే నలుగురికి సహాయం చేయాలి తప్ప.. ఎవరికీ చెడు చేయకూడదని నాన్న చెబుతుంటారు. ఆయనే నాకు స్ఫూర్తి.
– తమన్నా