ఇది మురళీమోహన్ ఓటమి!!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓడినది జయసుధ కాదని, మురళీ మోహనే ఓడిపోయారని పలువురు వ్యాఖ్యానించారు. సీనియర్ నటుడు విజయచందర్ అచ్చంగా ఇవే వ్యాఖ్యలు చేశారు. రాజేంద్రప్రసాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏవేం చెప్పారో అన్నీ చేయాలని ఆయన కోరారు. ఒకసారి పోటీచేసి, ఓడిపోయిన ఆయన.. కళాకారులకు ఏదో చేయాలన్న తాపత్రయంతో ఉన్నారని, అలా కాకుండా చిట్టచివరి నిమిషంలో జయసుధను తీసుకొచ్చి రంగప్రవేశం చేయించారని ఆయన అన్నారు. ఇది జయసుధ ఓటమి కాదని.. కేవలం మురళీమోహన్ ఓటమేనని ఆయన స్పష్టం చేశారు. మా కార్యాలయాన్ని కేవలం ఒక పార్టీ కార్యాలయంగా ఆయన మార్చేశారని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా కళాకారులంతా ఒక్కతాటిపై ఉండాలని, కానీ ఆయన దీన్ని ఒక పార్టీ వేదికగా మార్చేశారని మండిపడ్డారు.
ఊహించని పరాజయంతో జయసుధ, మురళీమోహన్ కంగుతిన్నారు. సినీ ట్విస్టులను తలపించిన మా ఎన్నికల ప్రస్థానంలో క్లైమాక్స్ తరహాలోనే కౌంటింగ్ కూడా అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.