గల్ఫ్‌ కష్టాలు తెలుసుకున్నా! | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ కష్టాలు తెలుసుకున్నా!

Published Mon, Jul 10 2017 1:15 AM

గల్ఫ్‌ కష్టాలు తెలుసుకున్నా! - Sakshi

‘‘సునీల్‌కుమార్‌రెడ్డిగారి సినిమాలన్నీ చూశా. విశాఖలో ఇంజినీరింగ్‌ చదివే టైమ్‌లో ‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’కు వెళ్లా. 60వ రోజున కూడా థియేటర్‌ హౌస్‌ఫుల్‌ అయింది. సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే ఆయన దర్శకత్వంలో ఎప్పటికైనా నటించాలనుకున్నా. లక్కీగా నా రెండో సినిమాతోనే కుదిరింది’’ అన్నారు చేతన్‌ మద్దినేని.

ఆయన హీరోగా సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్‌.యస్‌. రామ్‌కుమార్‌ నిర్మించిన సినిమా ‘గల్ఫ్‌’. చేతన్‌ మద్దినేని మాట్లాడుతూ – ‘‘సిరిసిల్ల చేనేత కార్మికుడి కుమారుడు శివ పాత్రలో నటించా. బతుకుదెరువు కోసం గల్ఫ్‌ వెళ్లిన వాళ్లు ఎలాంటి కష్టాలు పడ్డారనేది నా పాత్ర ద్వారా దర్శకుడు చూపించారు. కష్టాలే కాదు, ఫ్లైట్‌లో పరిచయమైన ఓ అమ్మాయి (డింపుల్‌)తో క్యూట్‌ లవ్‌స్టోరీ కూడా ఉంది. మా పేరెంట్స్‌ అమెరికాలో ఉంటారు.

వాళ్లను కలవడానికి ఇండియా టు అమెరికా వయా దుబాయ్‌ ఫ్లైట్‌లో వెళ్తుంటాను. జర్నీలో గల్ఫ్‌ కార్మికుల కష్టాలు కొన్ని తెలుసుకున్నా. ఈ సినిమా అంగీకరించాక, సునీల్‌కుమార్‌రెడ్డిగారితో నేనూ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు పర్యటించి రీసెర్చ్‌ చేశా. అందువల్ల, సినిమా అంతా తెలంగాణ యాసలో ఈజీగా నటించగలిగా. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’, ‘హై ఎండ్‌ ఫోన్‌’ సినిమాలు చేస్తున్నా. ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’కు మారుతిగారు నిర్మాత’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement