కమల్, శంకర్, కాజల్‌ విచారణకు హాజరు కావాలంటూ..!

Tamil Nadu Police To Summon Kamal Haasan And Director Shankar - Sakshi

సాక్షి, పెరంబూరు: ఇండియన్‌–2 చిత్ర షూటింగ్‌లో క్రేన్‌ కిందపడి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన కోలీవుడ్‌లో దిగ్భ్రాంతిని కలిగించింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ కార్మికులకు భద్రత కల్పించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఘటన బాధాకరం అని నటుడు కమల్‌ హాసన్‌ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా సినీ కార్మికులకు ఇక్కడ తగిన భద్రత లేకపోవడం బాధాకరమన్నారు. గురువారం సాయంత్రం గాయాలపాలైన ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులను పరామర్శించడానికి స్థానిక కీల్పాకంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల సాయాన్ని ప్రకటించారు. దర్శకుడు శంకర్, ఇండియన్‌– 2 చిత్ర నిర్మాత  సుభాస్కరన్‌ తదితరు యూనిట్‌ సభ్యులు క్షతగాత్రులను పరామర్శించారు.  చదవండి: దర్శకుడు శంకర్‌కు తీవ్ర గాయాలు

లైకా సంస్థ అధినేత సుభాస్కరన్‌ మృతుల కుటుంబానికి రూ.2 కోట్ల సాయాన్ని ప్రకటించారు. అదేవిధంగా ఇండియన్‌ 2 చిత్ర యూనిట్‌ మరణించిన యూనిట్‌ సభ్యుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించి సతాంపం తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే పూంవమల్లి, నసరద్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విచారణకు నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్, నటి కాజల్‌ అగర్వాల్‌కు సమన్లు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి తప్పిదం వంటి విషయాలపై వారిని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఒక సేవా సంస్థ  కమలహాసన్, దర్శకుడు శంకర్‌పై చెన్నై పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ లైకాపై 4 సెక్షన్లలో కేసు నమోదయ్యింది. అదేవిధంగా క్రేన్‌ యజమానిపై ఒక కేసు, చిత్ర నిర్వాహకుడిపై మరో కేసు నమోదు అయ్యాయి. తాజాగా ఈ సంఘటనపై విచారణను క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు అప్పగించారన్నది తాజా సమాచారం. ఇండియన్‌–2 చిత్రం మరింత చిక్కుల్లో పడనుందని సమాచారం.  చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క 

భద్రత ధ్రువీకరణ కలిగిన స్టూడియోల్లో.. 
భద్రత ధ్రువీకరణ కలిగిన స్టూడియోల్లోనే సినీ కార్మికులు పనిచేస్తారని దక్షిణ భారత సీనీ సమాఖ్య (ఫెప్సీ) అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి చెప్పారు. ఇండియన్‌–2 చిత్ర షూటింగ్‌ ప్రాంతంలో జరిగిన సంఘటనపై ఈయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌కే.సెల్వమణి శుక్రవారం ఇచ్చిన భేటీలో పేర్కొంటూ షూటింగ్‌లో ఆంగ్ల చిత్రాలకు సమారంగా తమిళ్, మొదలగు ఇతర భాషా చిత్రాల కార్మికులకు భద్రత వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇండియన్‌ 2 చిత్ర షూటింగ్‌లో మృతి చెందిన కృష్ణ, మధు ఇద్దరూ ఫెప్సీ సభ్యులని తెలిపారు. వారితో పాటు మరణించిన చంద్రన్‌ నిర్మాత మండలి సభ్యుడని, ఆయన మండలిలో పలు శాఖల్లో బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. ఇండియన్‌ 2 చిత్రానికి సినిమాలకు ఉపయోగించే క్రేన్‌ కాకుండా ఇతర వృత్తలకు వాడే క్రేన్‌ను ఉపయోగించడం వల్లే ఈ ఘోరం జరిగిందని అన్నారు.

ఇండియన్‌ 2 చిత్ర షూటింగ్‌ నిర్వహిస్తున్న ఈవీపీ ఫిలింసిటీలోనే ఇంతకుముందు కాల చిత్ర కార్మికులు ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోయారని గుర్తుచేశారు. ఇకపై భద్రతా ధ్రువపత్రం లేని స్టూడియోల్లో ఫెప్సీ సభ్యులు పని చేయరని సెల్వమణి స్పష్టం చేశారు. ఆంగ్ల చిత్రాలకు దీటుగా  చిత్రాలు చేసేవారు కార్మికుల భద్రత సౌకర్యాలు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా స్టూడియోలో పనిచేసే కార్మికులకు వైద్య బీమా కల్పించాలన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాథమిక వైద్య వసతులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా మృతి చెందిన ఫెప్సీ సభ్యులైన మధు, చంద్రన్‌కు వారి సంఘాలు తలా రూ.6 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా లైకా సంస్థ మరణించిన వారికి వైద్య ఇన్సూరెన్స్‌ను చేసినట్లు ఆర్‌కే.సెల్వమణి తెలిపారు.  చదవండి: 'ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్‌ టైసన్‌లా'

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top