ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ చిత్రం అంకితం | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ చిత్రం అంకితం

Published Thu, Jan 31 2019 2:14 AM

SV Krishna Reddy release 4 Letters movie audio launch - Sakshi

‘‘ఈశ్వర్‌కు హీరో కావాలనే గొప్ప కల ఉంది. ఆ కలను అతని తల్లి దండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సినిమా ఫీల్డ్‌లోనే కాదు. ఏ రంగంలో అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆశీర్వాదం లేకుంటే రాణించడం కష్టం’’ అని డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఈశ్వర్‌ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘4 లెటర్స్‌’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే..’ అన్నది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్‌. రఘురాజ్‌ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌ కుమార్‌ నిర్మించారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బ్యానర్‌ లోగోను నిర్మాత కిరణ్, ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు.

ఆడియో బిగ్‌ సీడీని నిర్మాత అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి విడుదల చేశారు. ‘‘చిన్న చిత్రాలు హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు అచ్చిరెడ్డి. ఆర్‌. రఘురాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని 75 రోజుల్లో పూర్తి చేశాం. టీమ్‌ ఎంతగానో సహకరించారు. ఇందులో మంచి సందేశం ఉంది. ఈ సినిమాను ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సినిమా సెకండాఫ్‌లో ఓ డిఫరెంట్‌ పాయింట్‌ను టచ్‌ చేశాం’’ అన్నారు. ‘‘ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 8న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఉదయ్‌ కుమార్‌. ‘‘తొలి సినిమాలోనే అన్నపూర్ణమ్మ, పోసాని, సురేష్‌గార్ల వంటి సీనియర్‌ నటులతో నటించడం హ్యాపీ. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈశ్వర్‌. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు సురేశ్, కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ మాస్టర్, గీత రచయిత చంద్రబోస్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు భీమ్స్, అంకిత, టువ మాట్లాడారు.
 

Advertisement
Advertisement