నటిని కావడం అమ్మానాన్నలకు ఇష్టం లేదు

నటిని కావడం అమ్మానాన్నలకు ఇష్టం లేదు

న్యూఢిల్లీ: తాను నటిగామారడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ చెప్పింది. దివంగత టెస్ట్ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్, నిన్నటి తరం నటి షర్మిలా టాగూర్‌ల గారాలపట్టి అయిన సోహా తన 25వ ఏటనే ముఖానికి రంగు వేసుకుంది. నటిగా మారాలన్న తన నిర్ణయం విని తన సోదరుడు సైఫ్ అలీఖాన్ సైతం దిగ్భ్రాంతికి గురయ్యాడని చెప్పింది. ఇటీవల కొందరు విద్యార్థులతో ‘ఫాలో యువర్ హార్ట్ (మీ మనసు చెప్పేది విను)’ అనే కార్యక్రమంలో మాట్లాడింది. 

 

 ‘‘నువ్వు నాతో పాటు ముంబైలో ఉంటున్నందుకు అమ్మానాన్నలు నన్ను నిందిస్తారు. చక్కని బ్యాంకు ఉద్యోగం ఉంది. నీ ఇష్ట ప్రకారమే నటినయ్యానని అమ్మానాన్నలతో చెప్పాలి’’ అని సైఫ్ తనను హెచ్చరించినట్లు వివరించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పట్టభద్రురాలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన సోహా 2004లో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. 

 

తాను నటిని కావాలని, తల్లి, సోదరుని అడుగుజాడల్లో నడవాలని ఎప్పుడూ ఆశపడలేదని, అయితే థియేటర్, నటన పట్ల ఉన్న మక్కువ తనను ఉద్యోగం వదులుకునేలా చేసిందని తెలిపింది. మొదటిసారి షాహిద్ కపూర్ సరసన ‘దిల్ మాంగే మోర్’ చిత్రంలో నటించిన సోహా ‘‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్’’లో నటనకు గాను విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఆమె నటిస్తున్న ‘వార్ చోడ్‌నా యార్’, ‘చార్‌ఫుటియా ఛోకరే’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top