నాదీ అక్కదీ ఒకటే కల

shivathmika rajashekar interview about dorasani - Sakshi

‘‘వారం రోజుల నుంచి మా ఇంట్లో సెలబ్రేషన్‌ మూడ్‌ నడుస్తోంది. డాడీ (రాజశేఖర్‌) ‘కల్కి’ రిలీజ్‌ అయిన 15 రోజులకే నా సినిమా (దొరసాని) రిలీజ్‌ అవుతోంది. ఇది ప్లాన్‌ చేసింది కాదు. కానీ ఈ మూమెంట్‌ని అందరం కలసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు కొంచెం టెన్షన్‌ కూడా పడుతున్నాం (నవ్వుతూ)’’ అని శివాత్మిక రాజశేఖర్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ, జీవితారాజశేఖర్‌ తనయ శివాత్మిక హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘దొరసాని’. కెవీ మహేంద్ర దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించారు. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా శివాత్మిక చెప్పిన విశేషాలు.

► నేను చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలోనే పెరిగాను. షూటింగ్‌ స్పాట్‌లోనే ఎక్కువరోజులు గడిపాను. చిన్నపటి నుంచి సినిమాలే ప్రపంచం. నాన్న సినిమాల షూటింగ్స్‌కి వెళ్లడం, స్క్రిప్ట్స్‌ చూడటం ఇలా అన్నీ చూస్తూ పెరిగిన నా మీద సినిమా ప్రభావం చాలా ఉంది.

► ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ పూర్తి చేసి కొంచెం బ్రేక్‌ తీసుకుని డ్రామా క్లాసులకో,  డ్యాన్స్‌ ఏదైనా నేర్చుకుందాం అనో ప్లాన్‌ చేశాను. ఆ సమయంలో ‘దొరసాని’ కథ నా దగ్గరకు వచ్చింది. ‘మధుర’ శ్రీధర్‌ అంకుల్‌ మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఈ సినిమా కోసం కొత్త అమ్మాయిని చూస్తున్నారు. ఆ సమయంలో కథ వినమన్నారు. మహేంద్రగారు నాలుగు గంటలు కథ చెప్పారు. చాలా గొప్పగా రాసుకున్నారు. కథ నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఆడిషన్‌ తీసుకున్నారు. స్క్రీన్‌ టెస్ట్‌ కూడా జరిగిన తర్వాతే నన్ను ఎంపిక చేశారు.

► తెలంగాణ ప్రాంతంలో జరిగిన పీరియాడికల్‌ మూవీ ఇది. ఒక దొరసానికి, రాజు అనే మామూలు కుర్రాడికి ప్రేమ ఎలా ఏర్పడింది? ఆ కాలంలో జరిగే ఇష్యూలను ఇందులో చూపించాం. మహేంద్రగారికి ప్రతీది ఆయన రాసుకున్నట్టుగానే ఉండాలి. సినిమాలో నా ఫస్ట్‌ సీన్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడటం. అది బ్యాక్‌ షాట్‌. కెమెరా నా వెనక ఉంటుంది. యాక్టింగ్‌ నా బ్లడ్‌లోనే ఉంది. సింగిల్‌ టేక్‌లో చేసి పడేస్తా (నవ్వుతూ) అనుకున్నాను. సెట్లోకి వెళ్లగానే ఫ్రీజ్‌ అయిపోయా. ఆ సీన్‌ని కూడా నాలుగైదు సార్లు చేయించారు మహేంద్రగారు. దొరసాని ఫోన్‌ అలా ఎత్తాలి, బాడీ లాంగ్వేజ్‌ ప్రత్యేకంగా ఇలానే ఉండాలి అన్నారు.

► ఆడిషన్‌ జరిగిన తర్వాత ఫస్ట్‌ సెలెక్ట్‌ అయింది ఆనందే. తను చాలా మంచి యాక్టర్‌. సెట్లో మేం మంచి ఫ్రెండ్స్‌ అయిపోయాం. ‘దొరసాని’ లో నా పాత్ర చాలా తక్కువ మాట్లాడుతుంది. సినిమా మొత్తం మీద 12 డైలాగ్స్‌ కూడా ఉండవేమో? అన్నీ కళ్లతోనే వ్యక్తపరచాలి. కొన్ని సీన్లలో చాలా స్ట్రయిన్‌గా అనిపించింది. నా బెస్ట్‌ అయితే ఇచ్చాననే అనుకుంటున్నాను. ప్రేక్షకులు డిసైడ్‌ చేయాలి.

► ‘మీ అమ్మలానే ఉన్నావు’ అని చాలామంది అన్నారు. ఈ సినిమాలో నా పాత్రకు లుక్స్‌పరంగా చాలా రిఫరెన్స్‌లు అమ్మ నుంచే తీసుకున్నాను. అమ్మ యంగ్‌గా ఉన్నప్పుడు ఎలాంటి జ్యూయలరీ వేసుకున్నారు అవన్నీ చూశాను. కానీ ఫర్ఫార్మెన్స్‌ని మాత్రం రిఫరెన్స్‌గా తీసుకోలేదు. మనకంటూ ఒరిజినాలిటీ ఉండదని నా ఫీలింగ్‌. అమ్మానాన్న కూడా అలా చెయ్‌ ఇలా చెయ్‌ అని చెప్పలేదు కానీ ‘చేసే పాత్రలో పూర్తిగా నిమగ్నం అయి చెయ్యి’ అని చెప్పారు.

► ‘కల్కి’ సినిమాకు నేను, అక్క కో–ప్రొడ్యూసర్స్‌గా చేశాం. ఇద్దరం చాలా కష్టపడ్డాం. నేను ‘దొరసాని’కి, ‘కల్కి’కి షిఫ్ట్‌ అవుతూ వర్క్‌ చేశాను. అక్క ఫోకస్‌ అంతా ఈ సినిమా మీదే. సెట్లో మేం ఇలా పని చేయడం చూసే ‘చిరంజీవి సినిమాలు చరణ్‌ ఎలా నిర్మిస్తున్నారో, నా సినిమాలు మా అమ్మాయిలు నిర్మిస్తున్నారు’ అని ‘కల్కి’ ఈవెంట్‌లో నాన్నగారు అన్నారు. మా కష్టాన్ని చూసి గర్వంతో అన్న మాటలవి. చిన్నప్పుడు.. నాకు అబ్బాయిలు ఉండుంటే ఇలా ఉండేది అలా ఉండేది అని మమ్మల్ని సరదాగా ఏడిపించేవారు. కానీ ఇప్పుడు ఆయన చాలా గర్వంగా ఉన్నారు.

► ఇంట్లో డాడీ స్క్రిప్ట్స్‌ అన్నీ చదివి, నరేట్‌ చేస్తుండేదాన్ని. అలా స్క్రిప్ట్స్‌ చదవడం అలవాటయింది. ఇప్పుడు మేం సినిమాలు చేస్తున్నాం అని డాడీ సినిమాలు తగ్గించనవసరం లేదు. ఆయన సినిమాలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. మమ్మీ సినిమా చూశారు. తనకు చాలా నచ్చింది. డాడీ మాత్రం ట్రైలర్, టీజర్స్‌ చూశారు.  చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

► ఆఫర్స్‌ ఉన్నాయి కానీ నెక్ట్స్‌ సినిమా ఏంటో ఇంకా నిర్ణయించుకోలేదు. నా వయసుకి తగ్గ పాత్రలు, నాకు సూట్‌ అయ్యేవి చేయాలనుకుంటున్నాను.

డాడీకి సీక్రెట్స్‌ దాచడం రాదు!
డాడీకి సీక్రెట్స్‌ మెయింటెయిన్‌ చేయడమే రాదు. బాగా వీక్‌. మేం అక్కకి బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తుంటే ఆయన వెళ్లి అక్కకే ‘నీ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం’ అని చెప్పేస్తారు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కూడా కలసి నటించాలనే ఆలోచన ఉంది. అది ఇంకా ఐడియా స్టేజ్‌లోనే ఉంది. అప్పుడే బయటకు చెప్పేశారు (నవ్వుతూ).
పదేళ్ల వయసు నుంచే అక్కా, నేను ఎలాంటి సినిమాలు చేయాలో అని మాట్లాడుకునేవాళ్లం. ఏదైనా సినిమా చూస్తే నీకు అలాంటి పాత్రలు సూట్‌ అవుతాయి అని నాకు చెబుతుంది. నేను తనకు ఏదైనా చెబుతాను. నాదీ, అక్కదీ ఒకటే కల. హీరోయిన్‌ అవాలని.

ఫేవరెట్స్‌ లేరు
‘మాకు మీ ఇద్దరూ ఇష్టమే. ఇద్దరిలో ఫేవరెట్స్‌ ఎవరూ లేరు’ అని చెబుతారు మమ్మీడాడీ. అది నిజమే అనుకుంటున్నాను (నవ్వుతూ). మేం నలుగురం ఫ్రెండ్స్‌లా ఉంటాం. మా ఫ్రెండ్స్‌ కూడా మమ్మీడాడీకి క్లోజ్‌. మా ఫ్రెండ్స్‌ కూడా ఏదైనా మాట్లాడాలంటే మా కంటే వాళ్లతోనే ఎక్కువ డిస్కస్‌ చేస్తారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top