మేం ఏం పాపం చేశాం : షేకింగ్‌ శేషు

Seshu Gives Clarification On East Coast Express Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్‌ కలెక్టర్‌తో జరిగిన వాగ్వాదంపై జబర్దస్త్‌ కమెడియన్‌ షేకింగ్‌ శేషు వివరణ ఇచ్చారు. అసలు విషయం తెలుసుకోకుండా పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు రిజర్వేషన్‌ చేసుకున్నామని అయితే, విజయనగరంలో జనరల్‌ టికెట్‌తో రైలు ఎక్కామని చెప్పారు. ఒడిశాకు చెందిన టిక్కెట్‌ కలెక్టర్‌ వారిపై నోరు పారేసుకున్నట్లు వెల్లడించారు.

ఫైన్‌ కడతామని, వైజాగ్‌ నుంచి ఏసీ కోచ్‌కు టికెట్లు రిజర్వేషన్‌తో ఉన్నాయని టీటీతో చెప్పినట్లు వివరించారు. బదులుగా టీటీ అసహ్యాంగా మాట్లాడారని తెలిపారు. వైజాగ్‌లో పోలీసుల, స్క్వాడ్‌ను పిలిచి అల్లరి చేస్తానని బెదిరించాడని చెప్పారు. అందుకే వైజాగ్‌ స్టేషన్‌లో కిందికి దిగామని తెలిపారు. తప్పు చేసింది టీటీ కావడంతో తాను జరిమానా కూడా చెల్లించాల్సిన పని లేకుండా పోయిందని చెప్పారు.

అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో ఆ ఘటనను చిత్రీకరించి మీడియాకు అందించాడని చెప్పారు. దీనిపై మీడియా రచ్చ చేయాల్సిన పనేముందని ప్రశ్నించారు. ఇవాళ సెలబ్రిటీ అంటే ప్రతి ఒక్కరికి లోకువైపోయారంటూ మండిపడ్డారు. కేవలం టీఆర్పీల కోసం మీడియా ఇలా చేయడం సరికాదన్నారు. తాను రైల్లో ఉండగానే మీడియాలో వార్తల గురించి ఫోన్లు వరుస పెట్టాయని చెప్పారు.

‘మేం ఏం పాపం చేశాం. మీకైదైనా అన్యాయం చేశామా?. రేటింగ్స్‌ కోసం సెలబ్రిటీలతో ఆడుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఒక కళాకారుడు బ్రతకకూడదు అని మీడియా అనుకుంటున్నట్లు ఉంది.’  అని ఆవేదన వ్యక్తం చేశారు శేషు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top