పద్మావతికి పట్టు చీర

Seen this Deepika Padukone shirt? Can you guess which famous - Sakshi

ప్రశంస

ధైర్యంగా నిలబడినవాళ్లకే ఏదైనా దక్కుతుంది! ‘పద్మావత్‌’ లీడింగ్‌ లేడీ దీపికా పదుకోన్‌కు ఆ సినిమాలో నటించినందుకు.. ఇంకా బెదరింపులు వస్తూనే ఉన్నాయి. నిందారోపణలూ కురుస్తూనే ఉన్నాయి. వాటన్నిటినీ తట్టుకుని చిరునవ్వుతో నిలబడ్డారు దీపిక. ‘బయటికి వస్తే నీ ముక్కు కోసి,  కాళ్లు విరగ్గొడతాం’ అని కర్ణసేన బెదిరిస్తే.. ‘కావాలంటే కాళ్లు విరగ్గొట్టండి కానీ, నా ముక్కును మాత్రం ఏం చేయకండి’ అని దీపికా సెటైర్‌ వేశారు. ‘పద్మావత్‌’ చూసి వచ్చి, ‘స్త్రీ అంటే అవయవమేనా, శీలాన్ని కాపాడుకోడానికి మంటల్లోకి దూకేయడం ఏంటి?’ అని స్వరా భాస్కర్‌ అనే బాలీవుడ్‌ నటి భన్సాలీని తిట్టిపోస్తే.. అందుక్కూడా దీపికే ధైర్యంగా సమాధానం ఇచ్చారు.

‘సినిమా ఆరంభంలో డిస్‌క్లెయిమర్‌ను వేస్తున్నప్పుడు స్వరా.. పాప్‌కార్న్‌ కొనుక్కోడానికి వెళ్లినట్టున్నారు’ అని మరో సెటైర్‌ వేశారు. ఇవన్నీ అలా ఉంచండి. సినిమాలో దీపిక పెర్ఫార్మెన్స్‌ చూసిన వాళ్లు థియేటర్‌ నుంచి బయటికి రాగానే, నేరుగా దీపిక ఇంటికి గిఫ్టుతో వెళుతున్నారు! లేటెస్టుగా అమితాబ్‌ ఈ అమ్మాయికి పూలగుత్తి పంపించి, ‘వెల్‌డన్‌ రా’ అని కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. ఇంకా లేటెస్టుగా రేఖ.. దీపికకు ఒక పార్శిల్‌ çపంపారు. ఖరీదైన పట్టుచీర అది! వెంటనే దాన్ని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి, ‘గెస్‌ హూ?’ అని అభిమానులకు పజిల్‌ పెట్టారు దీపిక. ‘బాజీరావ్‌ మస్తానీ’ చిత్రాన్ని చూసి వచ్చాక కూడా రేఖ ఇలాగే దీపికకు పట్టుచీర పెట్టారు. దీపికలో ఎక్కడో తనని చూసుకుంటున్నట్లున్నారు అలనాటి అందాల నటి రేఖ. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top