ఆయనంటే చాలా ఇష్టం: సాయి పల్లవి

Sai Pallavi Reveals That She Like Hero Suriya - Sakshi

సాక్షి, చెన్నై : మలయాళ చిత్రం ప్రేమమ్‌ చిత్రంతో సినీ పూతోటలో వికసించిన పువ్వు సాయిపల్లవి. అదే విధంగా తెలుగులో ఫిదా చిత్రంతో కథానాయకిగా పరిమళించిన ఈ చిన్నది తమిళంలో మాత్రం దియ చిత్రంతో అంతగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే నటిగా మాత్రం సాయిపల్లవి ఫెయిల్‌ కాలేదు. బహుశా తాజాగా సూర్యకు జంటగా ఎన్‌జీకే, ధనుష్‌కు జంటగా మారి–2 చిత్రాలతో విజయాల ఖాతాను ప్రారంభిస్తుందేమో. అదే విధంగా తెలుగులోనూ నటిస్తున్న సాయిపల్లవిపై పుకార్లు ప్రారంభం నుంచే ప్రసారం అవడం మొదలెట్టాయి. మణిరత్నం అవకాశాన్ని కాలదన్నుకుందని, షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తుందని, తాజాగా పారితోషికం కూడా పెంచేసిందనే వదంతులు దొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయిపల్లవి ఏమంటుందో చూద్దాం

సూర్యతో నటిస్తున్న అనుభవం గురించి?
సూర్య అంటే నాకు చాలా ఇష్టం.  పాఠశాలలో చదువుకుంటున్నప్పటి నుంచి ఆయన వీరాభిమానినని చాలా సార్లు చెప్పాను. ఎన్‌జీకే చిత్ర షూటింగ్‌లో తొలిసారిగా సూర్యను కలిసినప్పుడు నేనేమీ మాట్లాడలేదు. ఆయన్ని చూస్తూ సంతోషంలో అలానే నిలబడిపోయాను. అది గమనించిన సూర్య నవ్వారు. సూర్య షూటింగ్‌ స్పాట్‌లో సర్వ సాధారణంగా ఉంటారు. కెమెరా ముందుకు వెళితే వేరే విధంగా మారిపోతారు. ఆ అంకిత భావాన్ని నేనాయన నుంచి నేర్చుకుంటున్నాను.

చదువుకునే రోజుల్లో ఎక్కువ సార్లు చూసిన చిత్రం?
కన్నత్తిల్‌ ముత్తమిట్టాళ్‌. ఆ చిత్రం చూసి అమ్మానాన్నలతో నన్నూ మీరు దత్తత తీసుకుని పెంచుకుంటున్నారా అని అడిగాను. అంతగా ఆ చిత్రం నా మనసుని కదిలించింది. అలాంటిది నేను నటించడం మొదలెట్టిన తరువాత అందరికీ అభిమానినైపోయాను.

అన్నట్టు మీ చెల్లెలు కూడా నటిగా పరిచయం కాబోతోందటగా?
లేదు. అది కేవలం వదంతి మాత్రమే. నా చెల్లెలు పూజా సినిమాకు వచ్చే అవకాశం లేదు. నటించాలన్న ఆలోచన తనకు లేదు. నిజంగా పూజకు నటించాలనే ఆసక్తి ఉంటే కచ్చితంగా నాతో పాటు మా కుటుంబం ప్రోత్సహిస్తాం.

మొదట్లో మీరు మణిరత్నం చిత్రం, విక్రమ్, శింబు వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను చేజార్చుకున్నారనే ప్రచారం జరిగిందే?
నా విషయంలో నేను చాలా తెలివిగానే ఉన్నాను. ఈ సినిమా, పేరు, అభిమానులు అన్నీ ఎప్పుడైనా లభిస్తాయి. మరి కొద్ది కాలం తరువాత కొత్తవాళ్లు రంగప్రవేశం చేసి నా స్థానాన్ని అందుకోనూవచ్చు. అయితే విద్య అలా కాదు. ఒక నటి అనే కంటే డాక్టరు అనిపించుకోవడంలోనే నాకు సంతోషం, తృప్తి. ఒకరిని ఆరోగ్యవంతుడిని చేయడంతో పాటు కాకుండా, రోగం రాకుండా నిరోధించాలన్నదే నా ఆశ. అందుకే జార్జియాకు వెళ్లి డాక్టర్‌ పట్టాపొంది వచ్చాను. ఆ తరువాత అవకాశాలు రావడంతో నటిస్తున్నాను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top