
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఫస్ట్ చిత్రం విజయం సాధిస్తే.. ఆ తరువాత ప్రయాణం కాస్తా సులువవుతుంది. ప్రేమమ్ చిత్రంతో మలయాళంలో మలర్‌గా మెరిసిన నటి సాయి పల్లవి. అక్కడ తొలి చిత్రం ఆమెకు బాగానే వర్కౌట్ అయ్యింది. అదే మ్యాజిక్ తెలుగులోనూ రిపీట్ అయ్యింది. తెలుగులో సాయిపల్లవి నటించిన ‘మిడిల్‌క్లాస్ అబ్బాయి’, ‘ఫిదా’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఇంకా సక్సెస్ దక్కలేదు. ఇక్కడ తొలి చిత్రం ‘దయా’ సాయిపల్లవిని చాలా నిరాశ పరచింది. ఆ తరువాత ధనుష్‌తో జత కట్టిన ‘మారి–2’ ఓకే అనిపించుకుంది.
ఇప్పటివరకూ కోలీవుడ్‌లో సాయిపల్లవికి మంచి హిట్ పడలేదు. ప్రస్తుతం సూర్యకు జంటగా నటించిన ‘ఎన్‌జీకే’ చిత్రం మినహా మరో అవకాశం సాయి పల్లవి చేతిలో లేదు. దాంతో ప్రస్తుతం సాయి పల్లవి ఆశలన్నీ ‘ఎన్‌జీకే’ చిత్రంపైనే పెట్టుకుందట. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. సమ్మర్‌లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో మరో హీరోయిన్‌గా నటి రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా నటించింది. ప్రస్తుతం సాయిపల్లవి మాతృభాషలో ఫాహత్ ఫాజిల్‌తో ఒక చిత్రం చేస్తోంది.