వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

roy lakshmi interview about where is the venkatalakshmi - Sakshi

‘‘ఇప్పటివరకూ ఫ్యామిలీ, హారర్, థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమాలు చేశా. చాలా రోజులుగా కామెడీ నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుండేది. అది ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ చిత్రంతో తీరింది. ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ చిత్రమిది’’ అని రాయ్‌ లక్ష్మీఅన్నారు. ఈ సినిమాతో కిషోర్‌ కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి సమర్పణలో ఏబీటీ క్రియేషన్స్‌ పతాకంపై ఎం. శ్రీధర్‌ రెడ్డి, హెచ్‌. ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాయ్‌ లక్ష్మీ పంచుకున్న విశేషాలు... 

► గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’. ఇందులో వెంకటలక్ష్మి అనే చిన్నపిల్లల టీచర్‌ పాత్ర చేశాను. కామెడీ, హ్యూమర్‌తో పాటు థ్రిల్లింగ్‌ అంశాలు ఉంటాయి. ఈ మధ్య కామెడీ సినిమాలు వస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో రావడం లేదు. మా సినిమాలో వినోదంతో పాటు సస్పెన్స్‌ ఉంటుంది. అమలాపురం వద్ద షూటింగ్‌ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌.

► రచయిత తటవర్తి కిరణ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ కథ చెప్పగానే ఎగై్జట్‌ అయ్యా. కిషోర్‌ కుమార్‌కి ఇది తొలి చిత్రమైనా ఎక్కడా అలా అనిపించకుండా తెరకెక్కించారు. నిర్మాతలకు ఇది తొలి సినిమా అయినా ఖర్చు విషయంలో రాజీ పడలేదు. హరి గౌర పాటలు బాగున్నాయి. ఇందులోని ‘పాపా.. నీకు ఏదంటే ఇష్టం...’ నా ఫేవరేట్‌ సాంగ్‌. ఈ సినిమాలో ఎక్కువగా చీరలోనే కనిపిస్తా. చీరలోనూ ఎంతో గ్లామరస్‌గా కనిపించొచ్చని సుస్మితాసేన్‌గారు నిరూపించారు. 

► నేను తెలుగు సినిమాలు తగ్గించలేదు. ప్రస్తుతం తమిళ్‌లో బిజీగా ఉన్నానంతే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నా. నాది లీడ్‌ రోలా? స్పెషల్‌ సాంగా? అని ఆలోచించను. ఏదైనా నాకు ఓకే. ప్రత్యేక పాటలతోనూ నేను హ్యాపీ. బాలీవుడ్‌లో ప్రత్యేక పాట అంటారు.. టాలీవుడ్‌లో ఐటమ్‌ సాంగ్‌ అంటారు. ‘బలుపు’ సినిమా నుంచి ప్రత్యేక పాటల్లో నర్తిస్తున్నా. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్, ఖైదీనంబర్‌ 150’ చిత్రాల్లో చేసిన ప్రత్యేక పాటలు గుర్తింపు తీసుకొచ్చాయి.

► తెలుగులో నాకు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎక్కడికెళ్లినా ‘రత్తాలు’ అని పిలుస్తున్నారు. లక్ష్మీరాయ్‌ కంటే రత్తాలుగా బాగా ఫేమస్‌ అయిపోయా. ‘రత్తాలు’ పాట తీసే ముందు రోజు చిరంజీవిగారితో పాట అని రాత్రి ఫోన్‌ చేసి చెప్పారు. పొద్దున్నే హైదరాబాద్‌లో వాలిపోయా. ఈ పాటకు ప్రాక్టీస్‌ కూడా చేయలేదు. అది గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌.

► బాలీవుడ్‌లోనూ అవకాశాలొస్తున్నాయి. అయితే ‘జూలీ 2’ సినిమా జోనర్‌ సినిమాలే కావడంతో చేయడం లేదు. ప్రస్తుతం 3 తమిళ సినిమాలు, ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్నా. చాలా రోజుల కిందట ఓ తెలుగు సినిమాకి సంతకం చేశా. ఇందులో నేను, అంజలి కలిసి నటిస్తాం. నా డేట్స్‌ లేకపోవడంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ సినిమా రిలీజ్‌ తర్వాత నన్ను అందరూ ‘పాప’ అంటారు. ఈ చిత్రంలో నా పాత్ర చూశాక ప్రత్యేక పాటలివ్వాలనే వారి మైండ్‌సెట్‌ మారుతుందను కుంటున్నా (నవ్వుతూ).

► ‘మీటూ’ ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. కొంత మంది ప్రతీకారం తీర్చు కోవడం కోసం, ప్రచారం కోసం  మీడియా ముందుకు వచ్చారు. దాంతో ఆ ఉద్యమం అసలు లక్ష్యం నెరవేరలేదు. కొంతమంది వాళ్ల గళం విప్పిన విధానం మాత్రం అభినందనీయం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top