లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదు

RGV Open Challenge on Lakshmis  NTR - Sakshi

‘‘నేను దేవుడిని నమ్మనని చెప్పలేదు కానీ భక్తులను నమ్మనని చెప్పాను. ఎన్టీఆర్‌కి వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన ఇష్టం. అదే నన్ను ఇక్కడికి రప్పించిందేమో. ఎన్టీఆర్‌ విషయంలో ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజం మాత్రం ఆ దేవునికి మాత్రమే తెలుసు. నేను తీస్తున్న ఈ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లోని నిజమైన నిజాన్ని ప్రేక్షకుల ముందు చూపించడానికి నాకు శక్తిని ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించాను’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని, తిరుపతిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి హాజరు కాగా, జీవీ ఫిలిమ్స్‌ అధినేత బాలగిరి, నిర్మాత రాకేష్‌ రెడ్డి పాల్గొన్నారు. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘దివంగత ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను నిజాలతో నిరూపించడమే ఈ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ముఖ్య ఉద్దేశం. ఎంతోమంది నాయకులు ప్రజలను ఓట్లు అడుగుతారు. అయితే ఒక్క ఎన్టీఆర్‌ మాత్రం రేయ్‌ అని పిలిచి, ఓట్లు వేయించుకున్నారు. ఆ పిలుపులో నిజాయతీ కనిపిస్తుంది. అప్పట్లో సినీ పరిశ్రమలో ఎంతో మంది అందమైన కథానాయికలు ఉన్నప్పటికీ లక్ష్మీపార్వతిని ఆయన వివాహం చేసుకోవడం నాకు పెద్ద సందిగ్ధం. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తెరకెక్కించేందుకు కొన్ని రోజుల పాటు నిర్వహించిన సర్వేల్లో లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగానూ, అనుకూలంగాను, రాజకీయ కోణంలోను అనేక ఆరోపణలు వచ్చాయి.

చివరగా ఎన్టీఆర్‌ చనిపోకముందు ఆయన లక్ష్మీపార్వతి గురించి మాట్లాడిన మాటలు సాక్ష్యంగా నిలిచాయి. ఒకవైపు ఎన్టీఆర్‌ ఫొటోలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌ తెలుగోడి సత్తాను చాటారు. నిజాల వెనక ఉన్న నిజాలను నిరూపించేందుకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. వాటిని కాదనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మహా మనిషి జీవిత చరిత్రపై ఎంత మంది సినిమాలు తీసినా, స్వర్గంలో ఉన్న ఆయన ఆశీస్సులు మా సినిమాపైనే ఉంటాయి. నేను రాజకీయాల్లో ఒక్క ఎన్టీఆర్‌ని తప్ప ఎవరినీ అనుసరించలేదు. ఈ సినిమాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయడం ఖాయం. జనవరి 24న విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఎన్టీఆర్‌కి జరిగిన ద్రోహం, ఆయన మృతి వెనక దాగి ఉన్న నిజాలు బయటకు రావాలనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుంది. ఎన్టీఆర్‌ నుంచి అధికారాన్ని అల్లుడు, సినిమా, సంపదలను కొడుకులు లాక్కున్నారు. ఆయనలో ఉన్న పట్టుదలను నాకు ఇచ్చి వెళ్లారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వర్మగారు నన్ను అడగలేదు. ఆయన ఏం చూపిస్తారో అనే భయం నాలోనూ ఉంది. ఈ సినిమా స్కిప్ట్రు నాకు చూపించాలి’’ అన్నారు లక్ష్మీపార్వతి. ‘‘ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సినిమాను పూర్తి చేస్తాం. ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు రాకేష్‌ రెడ్డి. ఎమ్మెల్యేలు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top