
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ కెరీర్‌లో ‘నరసింహ’ చిత్రంలోని నీలాంబరి, ‘బాహుబలి’ సినిమాలో చేసిన శివగామి పాత్రలు ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఆ పాత్రల్లో ఆమె నటనను ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాణి శివగామి’. మధు మిణకన్ గుర్కి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్ పతాకంపై మురళీకృష్ణ దబ్బుగుడి నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బోనాల పండగ సందర్భంగా విడుదల చేశారు. చిత్రనిర్మాత మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ డ్రామాతో సోషియో ఫాంటసీగా రూపొందిన చిత్రమిది.
గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యత ఇచ్చాం. రమ్యకృష్ణను కొత్త కోణం లో ఆవిష్కరించే చిత్రం ఇది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘9వ శతాబ్దంలో ప్రారంభమయ్యే ఈ కథ 21వ శతాబ్దం వరకు ఉంటుంది. ఈ కాలంలో జరిగే సంఘటనలు ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు మధు మిణకన్ గుర్కి. ఈ చిత్రానికి సంగీతం: వీర్ సమ్రత్, కెమెరా: బాల్‌రెడ్డి, సహ నిర్మాతలు: దబ్బుగుంట వెంకటశేషయ్య యాదవ్, దబ్బుగుంట మహేష్‌కుమార్ యాదవ్.