
కబాలి నోట మలై మాట!
తెలుగు చిత్రాల్లో బుగ్గ మీద గాటు పెట్టుకుని మీసాలు మెలితిప్పుకుని, లుంగీ కట్టుకుని పాత విలన్ ‘ఏ కబాలి?
‘‘తెలుగు చిత్రాల్లో బుగ్గ మీద గాటు పెట్టుకుని మీసాలు మెలితిప్పుకుని, లుంగీ కట్టుకుని పాత విలన్ ‘ఏ కబాలి? అనగానే ఒంగొని వినయంగా ‘ఎస్ బాస్’ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నార్రా...కబాలి రా...!’’ అంటూ ‘కబాలి’ ట్రైలర్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో తనదైన స్టయిల్లో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ సూపర్ అంటున్నారు ఆయన అభిమానులు. ‘భాషా’ తర్వాత గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో ‘కబాలి’గా రజనీకాంత్ లుక్, స్టయిల్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి.
ఆరేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’ తర్వాత ‘కొచ్చాడయన్’, ‘లింగ’ చిత్రాలు అభిమానులను నిరాశపరిచాయి. ఇప్పుడు అర్జెంట్‌గా రజనీ అభిమానులకు ఓ హిట్ కావాలి. రజనీ కూడా అభిమానులకు మంచి హిట్ మూవీ ఇవ్వాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ చిత్రాల దర్శకుడు పా రంజిత్ చెప్పిన కథకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. విశేషమేమిటంటే పా రంజిత్ అప్పటికి కేవలం రెండే సినిమాలు చేశారు. అయినా సరే, రజనీకాంత్ కంటెంట్‌ను నమ్మి ఆయనకు అవకాశమిచ్చారు. ఒక పక్క శంకర్ దర్శకత్వంలో ‘రోబో’ సీక్వెల్ ‘2.0’, మరో పక్క ‘కబాలి’ చిత్రీకరణలలో పాల్గొంటూ బిజీబిజీగా గడిపేశారు. ఇటీవలే ‘కబాలి’ షూటింగ్‌ను కూడా పూర్తిచేశారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో పాటలను, జూలై 1న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని మలేసియాలో అక్కడి అధికార భాష మలైలో అనువదించి విడుదల చేయాలనుకుంటున్నారట. ఇప్పటివరకూ రజనీ నటించిన చిత్రాలు మలేసియాలో తమిళంలోనే విడుదల అయ్యాయి. అనువాద రూపంలో విడుదల కానున్న తొలి భారతీయ చిత్రం ‘కబాలి’. ఇది మలేసియా నేపథ్యంలో సాగే సినిమా కావడం, అక్కడ రజనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ నిర్ణయం తీసుకున్నారట.