ఆయన ఇలాగే ముందుకు సాగాలి | Sakshi
Sakshi News home page

ఆయన ఇలాగే ముందుకు సాగాలి

Published Wed, Mar 16 2016 10:36 PM

ఆయన ఇలాగే ముందుకు సాగాలి

- గద్దర్
 ‘‘సామాజిక ప్రయోజనం కోసం తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే మా కృషి ఫలించినట్లు భావిస్తాం. ఆర్. నారాయణమూర్తి ఇప్పటి వరకూ సామాజిక సమస్యలపై తీసిన సినిమాలకంటే ఇదొక రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఆయన ఇలాగే ముందుకు సాగాలి. అందుకు మేమెప్పుడూ అండగా ఉంటాం’’ అని ప్రజా కవి గద్దర్ తెలిపారు. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దండకారణ్యం’ 18న విడుదలవు తోంది.
 
  ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ను  నిర్వహించారు. పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ ప్లాటినమ్ డిస్క్‌లను చిత్ర బృందానికి అందించారు. ‘‘నారాయణ మూర్తి కాలం వంటివారు. అందుకే ఎవరికీ లొంగ కుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు’’ అని అశోక్‌తేజ అన్నారు.
 
 ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ - ‘‘ఆదివాసీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించి ప్రభుత్వం గనులు, బాక్సైట్ గనుల తవ్వకాలను చేపడుతోంది. దాంతో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో పాటు పర్యావరణం నాశనం అయిపోతోంది. ప్రభుత్వం వారి హక్కులను కాపాడి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం’’ అని చెప్పారు. సంగీత దర్శకులు ‘వందేమాతరం’ శ్రీనివాస్, ప్రజా కవులు గోరటి వెంకన్న, యశ్‌పాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement